పకడ్బందీగా ప్రాక్టికల్స్
ఈనెల 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
148 కేంద్రాలు, 27,438 మంది విద్యార్థులు
పరీక్ష కేంద్రాలు జీపీఎస్‌తో అనుసంధానం
మాస్ కాపీయింగ్‌ను ఉపేక్షించేది లేదు
హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలలపై చర్యలు
ఆర్‌ఐవో ఎల్.సుహాసిని
కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు గురువారం నుంచి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఐఓ ఎల్.సుహాసిని వెల్లడించారు. సోమవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఎక్స్‌టర్నల్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 50 ప్రభుత్వ కళాశాలలు, ఎనిమిది సాంఘిక కళాశాలలు, ఒక గిరిజన సంక్షేమ కళాశాల, 89 ప్రైవేట్, ఆన్‌ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27,438 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవనుండగా, ఇందులో వొకేషనల్ విద్యార్థులు 5044 మంది ఉన్నారని చెప్పారు. ఫీజు బకాయిల పేరుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పరీక్షల నిర్వహణ విషయంలో డిపార్టుమెంటల్ అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు, కళాశాలల యాజమాన్యాలకు ఇదివరకే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. నిర్ణయించిన తేదీల్లో విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి అనుమతి తీసుకొని చివరి విడతలో పరీక్ష రాసేందుకు ఆవకాశం ఉంటుందని తెలిపారు. బ్యాచ్‌కు 25 మంది విద్యార్థులకు పరీక్ష ఉంటుందని, 25 శాతం మార్కులు అందరికీ వస్తే మళ్లీ రివేరిఫికేషన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించామన్నారు. ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు బోర్డు నుంచి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
జీపీఎస్‌తో అనుసంధానం..
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, వార్షిక పరీక్షల కేంద్రాలపై నిఘా ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)లో జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాలను అనుసంధానం చేసినట్టు ఆర్‌ఐవో తెలిపారు. ఈ విధానం ద్వారా పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాడే సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్‌ల సమాచారం పూర్తిగా రికార్డు అవుతుందన్నారు. సంక్షిప్త సందేశాల సమాచారం కూడా కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో పనిచేసే బృందం పరిశీలన చేస్తుంటుందని చెప్పారు. ప్రశ్నపత్రాలు తరిలించే వాహనాలకు సైతం ట్రాలీట్యాగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా వాహనం ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఎంతసేపు ఆగింది, వాహనంలో ఏఏ విషయాలు మాట్లాడారనే పూర్తి సమాచారం నమోదై నియంత్రణ విభాగానికి చేరేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, స్క్వాడ్ సిబ్బందికి సంబంధించిన అన్ని సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ నంబర్లను ఇంటర్ విద్యామండలికి పంపించామని తెలిపారు.