విజయవంతంగా సంక్షేమ కార్యక్రమాలు
షికాగోలో వ్యవసాయ మంత్రి పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన.. షికాగోలో అమెరికా తెలంగాణ సంఘం మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తెచ్చిందన్నారు. వాతావరణ మార్పులు, వర్షపాతానికి అనుకూలమైన పంటల ఎంపిక విషయంలో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నామన్నారు. రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు.
రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని... అందులో భాగంగా మిషన్ కాకతీయ, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేస్తున్నామన్నారు. పాలీహౌస్ విస్తీర్ణం పెరిగిందన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు ముందుకు రావాలన్నారు. వ్యవసాయ సంబంధిత ప్రశ్నలకు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి సమాధానాలు ఇచ్చారు. అనంతరం మంత్రి ప్రతినిధి బృందం అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శన నిర్వాహకులతో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ మురళి, అమెరికా తెలంగాణ సంస్థ వ్యవస్థాపక సభ్యులు కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.