
సాక్షి, మెట్టుగడ్డ(మహబూబ్‌నగర్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మతం, కులంతో సంబంధం లేకుండా అందరికీ ఈ దేశంలో సమానహక్కు రాజ్యాంగం కలి్పంచిందని తెలిపారు. కానీ మోదీ, అమిత్ షా నిరంకుశ పాలనతో చట్ట సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అమిత్ షా దేశంలో ఎన్‌ఆర్‌సీ అమలు చేసి తీరుతామని చెప్పినప్పటికీ, మోదీ ఢిల్లీ బహిరంగసభలో ఎన్‌ఆర్‌సీని అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్ (జనగణన) పేరుతో ఎన్‌ఆర్‌సీని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సీఏఏకి వ్యతిరేకంగా దేశంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు, ప్రజలపై కాల్పులు జరిపి 18మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. మత ప్రాతిపదికన తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కుల, మతాలకతీకంగా వ్యతిరేకించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ తరహాలో తెలంగాణలో కూడా ఎన్‌పీఆర్‌పై స్టే విధించాలని కోరారు. అనంతరం వక్తలు మాట్లాడారు. సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ మొహమ్మద్ ఖాన్, సయ్యద్ అబ్దుల్ రజాక్ షా ఖాద్రి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, అబ్దుల్ హాదీ, జాకీర్, షఫీ ఉద్దీన్, సుజాత్ అలీ, ముస్లిం సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరులో భారీ బందోబస్తు
మహబూబ్‌నగర్ క్రైం: పౌరసత్వ సవరణ చట్టంపై జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సభకు జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా మైదానం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సభకు 320 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్సైఐలు, 30మంది ఏఎస్సైఐలు, దాదాపు 220కిపైగా ఇతర కానిస్టేబుల్స్‌తో రెక్కీ నిర్వహించారు. పట్టణంలో ఉన్న మజీద్‌లు, ముఖ్య కూడళ్లు, రద్దీ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహించారు. జెడ్పీ మైదానంలో జరిగిన సభకు పోలీసులు లోపలికి వెళ్లే ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment