
ఎక్కడికక్కడ ‘ఆశ’ల అరెస్టు
కుకునూర్‌పల్లి వద్ద సొమ్మసిల్లిన కార్యకర్తలు
సంగారెడ్డిలో తోపులాట.. వెల్దుర్తిలో నిర్బంధం
సంగారెడ్డి: తమ సమస్యల పరిష్కారానికి పాదయాత్రగా హైదరాబాద్ బయలు దేరిన ఆశ కార్యకర్తలను మెదక్ జిల్లాలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ నెల 16న జరగనున్న ‘చలో హైదరాబాద్’ కోసం జిల్లాలో ఆశ కార్యకర్తలు ముందస్తుగానే హైదరాబాద్‌కు చేరేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆశ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి. సంగారెడ్డి చౌరస్తా నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలు దేరిన ఆశ కార్యకర్తలను కంది ఐఐటీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసే క్రమంలో అయిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యాయి.
సీఐ టీయూ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కొండపాక మండలం కుకునూర్‌పల్లి వద్ద ఆశ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా ముగ్గురు స్పృహ తప్పారు. కరీంనగర్ సీఐటీయూ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఓ స్కూల్లో ఆశ కార్యకర్తలను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి నిర్బంధించారు. పోలీసుల తీరుకు నిరసనగా సీఐటీయూ సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.