డిమాండ్లపై మల్లగుల్లాలు! | Ashwathama Reddy Speaks Over TSRTC Strike | Sakshi
Sakshi News home page

డిమాండ్లపై మల్లగుల్లాలు!

Published Tue, Nov 5 2019 4:02 AM | Last Updated on Tue, Nov 5 2019 9:17 AM

Ashwathama Reddy Speaks Over TSRTC Strike - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుపై పట్టు వీడట్లేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే విధుల్లో చేరాలనే డిమాండ్‌ నుంచి తగ్గడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5 లోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ విధించిన గడువు నేటితో ముగియనుంది. డెడ్‌లైన్‌ దగ్గరపడటంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలా.. వద్దా.. అనే నిర్ణయంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులెవరూ విధుల్లో చేరకుండా వారికి ధైర్యం చేప్పేందుకు ఉపక్రమించారు. ఆర్టీసీ జేఏసీలో టీఎంయూ, ఈయూ సంఘాలుండగా.. వేరుగా ఉన్న ఎన్‌ఎంయూ నేతలు సైతం సమ్మె విచ్ఛిన్నం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

కార్మిక సంఘాలు సోమవారం వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొంతమందికి ఫోన్లు చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మెజారిటీ కార్మికులు విలీనం డిమాండ్‌ను పక్కనపెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడే ఏయే డిమాండ్ల నుంచి తగ్గాలనే దానిపై నిర్ణయానికి రావాలని సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే కార్మికులెవరూ విధుల్లో చేరొద్దని, ధైర్యంగా ఉండాలని నేతలు చెప్పారు. విధుల్లో చేరిన వారిని సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు నేతలు చెప్పారు. కొన్నిచోట్ల విధుల్లో చేరిన వారు కూడా తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. డిమాండ్లు సాధించుకునే దిశగా సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. కాగా, ఇప్పటివరకు 24 మంది కార్మికులు విధుల్లో చేరినట్లు తెలిసింది.

యథావిధిగా సమ్మె: అశ్వత్థామరెడ్డి
సమ్మె పట్ల ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా ఉన్నారని, కార్మికుల మద్దతుతోనే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సీఎం డెడ్‌లైన్‌ విధించినా కార్మికులెవరూ విధుల్లో చేరట్లేదని స్పష్టం చేశారు. 11 మంది చేరినా వారిలో ఐదుగురు మళ్లీ వెనక్కి వచ్చారని తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరి గింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జేఏసీని చర్చలకు ఆహ్వానించి 26 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు మరోసారి విన్నవించుకుంటున్నట్లు తెలిపారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, భేషరతుగా విధుల్లో చేరడానికి కార్మికులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

31 రోజులుగా సమ్మె జరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా అనేకమంది కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 5న అన్ని డిపోల వద్ద మానవహారాలు, 6న కుటుంబసభ్యులతో దీక్ష, తాత్కాలిక సిబ్బందికి విన్నపం, 7న ప్రజా సంఘాల ప్రదర్శన, 9న చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కోకన్వీనర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని హెచ్చరికలు చేసినా సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులందరూ డెడ్‌లైన్, డిడ్‌లైన్‌ జాన్తా నై అంటున్నారని పేర్కొన్నారు.

చర్చలకు ఆహ్వానించాలి
ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. సోమవారం డిపో, రీజనల్, జోనల్, రాష్ట్రస్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించింది. సుదీర్ఘ చర్చల తర్వాత రెండు అంశాలపై తీర్మానాలు చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఆహ్వానించాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని తీర్మానించినట్లు ఎన్‌ఎంయూ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

6531 బస్సులు తిప్పాం: ఆర్టీసీ
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,531 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 4,620 బస్సులు ఆర్టీసీ సంస్థకు చెందినవి కాగా, 1,911 బస్సులు ప్రైవేటువి. 410 బస్సులను టికెట్ల ద్వారా నిర్వహించగా.. 5815 బస్సుల్లో టిమ్‌ మెషీన్ల ద్వారా టికెట్లు ఇచ్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement