మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం | ASI mohan reddy followers attacks lawyer and media people | Sakshi
Sakshi News home page

మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం

Published Fri, Jan 1 2016 3:29 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం - Sakshi

మోహన్‌రెడ్డి బంధువుల వీరంగం

కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో నిందితుడైన ఏఎస్సై మోహన్‌రెడ్డి కొడుకు, బంధువులు, అనుచరులు గురువారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో వీరంగం సృష్టించారు. వారించబోరుున న్యాయవాదులను దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. న్యాయవాదులంతా ఐక్యంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. మోహన్‌రెడ్డితోపాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది నిందితులను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన అతని బంధువులు కోర్టు వద్దకు వచ్చారు.

పైఅంతస్తులో ఎవరో ఫొటోలు తీస్తున్నారంటూ  మోహన్‌రెడ్డి భార్య లతతోపాటు వారి బంధువులు గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఆయన కుమారుడు అక్షయ్‌రెడ్డి, తమ్ముడు మహేందర్‌రెడ్డి, అనుచరుడు బల్వీందర్‌సింగ్ ‘ఎవడురా..  ఇక్కడ పోటోలు తీసింది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న న్యాయవాదులు పులియాల వేణుగోపాల్‌రెడ్డి, సిరికొండ శ్రీధర్‌రావు, గౌరు రాజిరెడ్డి, ఆవునూరి అశోక్‌కుమార్, సిహెచ్.ప్రదీప్‌కుమార్‌రాజు వారిని అడ్డుకొని ఎవరైనా ఫొటోలు తీస్తే న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని, విధులకు భంగం కలిగేలా కోర్టు భవనంలో వ్యవహరించరాదని సూచించారు.

ఈ క్రమంలో న్యాయవాదులపై తీవ్రపదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో న్యాయవాదులకు, మోహన్‌రెడ్డి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోర్టు అవరణలో అరగంటసేపు తీవ్రఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మోహన్‌రెడ్డి తరఫు వారిని బయటకు పంపించారు. ఈ దాడిలో న్యాయవాదుల విలువైన వస్తువులు, సెల్‌ఫోన్లు కింద పడి పగిలిపోయాయి. దీంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావు టూటౌన్ సీఐకి సమాచారం అందించగా వెంటనే వచ్చి ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
 
ఎస్కార్ట్ పోలీసుల ఉదాసీనత
కోర్టుకు హాజరైన ప్రతిసారి ఎస్కార్ట్ పోలీసులు మోహన్‌రెడ్డి, అతడి అనుచరులు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితుల బంధువులు, అనుచరులు ఎంతమంది వచ్చినా కోర్టు అనుమతి లేకుం డానే విచ్చలవిడిగా మాట్లాడుకోవడానికి స్వేచ్ఛనిస్తున్నారు. మోహన్‌రెడ్డి అనుచరులు కోర్టులోనే ఇంత వీరంగం చేస్తున్నారంటే బయట బాధితుల ఎలా ప్రవర్తిస్తున్నారోనని పలువురు చర్చించుకున్నారు.  
 
ఎస్పీతో మాట్లాడతా : జిల్లా జడ్జి నాగమారుతిశర్మ
న్యాయవాదులపై జరిగిన దాడిగురించి బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జిల్లా కోర్టులో ఉన్న జిల్లా జడ్జి నాగమారుతిశర్మకు వివరించారు. ఎస్పీతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూ స్తామని ఆయన న్యాయవాదులతో అన్నారు. కాగా, ఈ ఘటనపై న్యాయవాది ఘంటా సతీష్‌మోహన్‌కుమార్ టూటౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు.  ఇదిలా ఉండగా, మోహన్‌రెడ్డితో పాటు అతడి అనుచరుల రిమాండ్‌ను జడ్జీ ఈనెల 13 వరకు పొడగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement