తెలంగాణ శాసనసభలో గురువారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లావాసి కావడంతో అందరి దృష్టి బడ్జెట్‌పై పడింది. వడ్డించేటోడు మనోడే కావడంతో జిల్లాకు అధికంగా నిధులు వస్తాయని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తగిన డబ్బులు సమకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గత ఏడాది చివర్లో స్వల్పకాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటెల ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తారనే ఆశాభావాన్ని స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు.
వాటర్‌గ్రిడ్, హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో జిల్లాల్లోని పలు ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా... ఎత్తిపోతల పనులు పెండింగ్‌లో ఉండడంతో రాబోయే ఖరీఫ్ నాటికి నీరందించాలనే లక్ష్యం నెరవేరేలా లేదు.
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పరిధిలో మిడ్‌మానేరు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులకు నిధుల సమస్య వెంటాడుతున్నందున తగిన కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కరవు ఛాయలు కమ్ముకున్నారుు.
భూగర్భ నీటిమట్టాలు పూర్తిగా పడిపోతుండటంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన కేటాయింపులు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నందున వీటికి సైతం నిధులు కేటాయించాలని జనం కోరుతున్నారు. అవేమిటంటే... జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల సేకరణ, మెడికల్ కళాశాల ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, ప్రధాన ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం వంటి వాటికి బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరగాల్సి ఉంది.
శాతవాహన యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్మాణానికి రూ.60 కోట్లు అవసరం కాగా, రూ.24.40 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లో రూ.35.60 కోట్లు కేటాయించాల్సి ఉంది. మిడ్‌మానేరుతోపాటు ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు జరగాలి.జిల్లాలో మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కింద 5939 చెరువులకు 1188 చెరువులను మొదటి సంవత్సరంలో పునరుద్ధరించేందుకు పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంది. అర్బన్, రూరల్ వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయింపు జరగాల్సి ఉంది.
సీఎం హామీల్లో భాగంగా...
ఎస్సారెస్పీ-మిడ్‌మానేరు మధ్య చెక్‌డ్యాం నిర్మాణానికి, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ స్థాయి పెంపునకు, ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్టుల ఏర్పాటుకు నిధులు కేటాయించాల్సి ఉంది.జిల్లాలో ఏడు చోట్ల కొత్త వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు అవసరం.
కొండగట్టుపైన 300 ఎకరాల స్థలాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం, తిరుపతి స్థాయిలో తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు కావాలి.రామగుండం మున్సిపాలిటీకి ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీటి సరఫరాకు పైపులైన్, మైనింగ్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది.పెద్దపల్లి నియోజకవర్గంలోని హుస్సేనిమియా వాగుపై మూడు చెక్‌డ్యాంల నిర్మాణంతోపాటు కరీంనగర్‌లో ఔటర్‌రింగు రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అనుగుణంగా నిధుల మంజూరు చేయూలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
వడ్డించేది మనోడే
Published Wed, Mar 11 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement