సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియెట్‌లో గెజిటెడ్ రిపోర్టర్లుగా పనిచేస్తున్న గ్రూప్ –1 కేడర్ ఉద్యోగులు పాతికేళ్లుగా పదోన్నతులకు నోచుకోవడంలేదు. ఫలితంగా ఇతర విభాగాల్లోని కిందిస్థాయి ఉద్యోగులు గడిచిన ఇరవై ఏళ్లలో నాలుగు నుంచి ఐదు పదోన్నతులు పొందినా, గెజిటెడ్ రిపోర్టర్లు మాత్రం నిబంధనల కిరికిరితో పదోన్నతులు పొందలేకపోతున్నారు. 1952 నాటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం రిపోర్టర్లు, సెక్షన్ ఆఫీసర్లు 1:1 ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్ పొందేవారు.
1956లో ఆంధప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కూడా 1979 వరకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్‌నే అమలు చేశారు. అసెంబ్లీలో క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందన్న కారణతో 1979లో పదోన్నతుల నిష్పత్తిని 3:1 గా మార్చారని, దీనివల్ల సెక్షన్ ఆఫీసర్లకు 3, రిపోర్టర్లకు 1 చొప్పునే అసిస్టెంట్ సెక్రటరీ పదోన్నతి దక్కుతోందని అసెంబ్లీ గెజిటెడ్ రిపోర్టర్లు వాపోతున్నారు. పదోన్నతుల నిష్పత్తిని మారుస్తూ తెచ్చిన జీవో 82 ను హైకోర్టు, సుప్రీం కోర్టులు కొట్టివేసినా 1983లో మళ్లీ జీవో 66ను తీసుకువచ్చారని, ఇప్పటికీ అదే పద్ధతిని అమలు చేస్తుండడంతో తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సిబ్బంది విభజన జరిగింది. దీని ప్రకారం సెక్షన్ ఆఫీసర్ల క్యాడర్ స్ట్రెంత్‌ను 13గా, రిపోర్టర్ల క్యాడర్ స్ట్రెంత్‌ను 32గా నిర్ధారించారు. పాత నిబంధన అయిన 3:1ని మార్చకపోవడం వల్ల, ఇంకా ఏపీ సర్వీసు రూల్సును అమలు చేస్తున్నారని, గడిచిన 27 ఏళ్లుగా తమకు ఎలాంటి పదోన్నతులు దక్కలేదని వాపోతున్నారు.
తమ సమస్యను సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శుల దృష్టికి తీసుకు వెళ్లారు. సుప్రీం, హైకోర్టుల తీర్పు మేరకు హైకోర్టు, రెవెన్యూ, సెంట్రల్ ఎక్సయిజ్ శాఖలో అనుసరిస్తున్న నియమ నిబంధనలనే అసెంబ్లీలో కూడా పదోన్నతుల్లో అవలంభించాలని ‘తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్ గెజిటెడ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వీరారెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment