సాక్షి, హైదరాబాద్: స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తికలను బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి తీసుకురానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. వాటిని తీసుకువచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాజ్‌పేయి అస్థికలు బుధవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకుంటాయని, వాటిని అక్కడి నుంచి బీజేపీ పార్టీ కార్యాలయానికి తీసుకువస్తారని వివరించారు. వాటిని ఈనెల 23న ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని వెల్లడించారు.
ఆ తరువాత వాటిని మేడ్చల్ మీదుగా రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసరకు తీసుకెళతామని వెల్లడించారు. అస్థికలను బాసరలోని గోదావరి పుణ్యనదిలో లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కలుపుతారని వివరించారు. మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం చేవెళ్ల వికారాబాద్ మీదుగా అనంతగిరిలోని మూసీ సంగమంలో అస్థికలను కలుపుతారని వివరించారు. ఇక ఈనెల 24, 25 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులతో వాజ్‌పేయి సంతాప సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment