సర్కారు అసమర్థతతోనే దాడి
- ఏబీవీపీ కార్యాలయంలో బైకులనుదగ్ధం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
- ఏబీవీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
నల్లకుంట: కేసీఆర్ సర్కారు అసమర్థతతోనే ఏబీవీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, దుండగుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో గుర్తించి అరెస్టు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 4 :51 గంటలకు విద్యానగర్ ఓయూ రోడ్డులోని ఏబీవీపీ కార్యాలయం మెట్ల వద్ద పార్క్ చేసిన రెండు బైకులను గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి దగ్ధం చేసిన సంఘటన విధితమే. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్, ఎన్‌వైకే నేషనల్ వైస్ చైర్మన్ పేరాల శేఖర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్, బీజేపీ, బీజేవైఎం, వీహెచ్‌పీ రాష్ట్ర కమిటీలు శనివారం ఉదయం ఏబీవీపీ కార్యాలయం వద్దకు చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు.
సంఘటన జరిగి 24 గంటలు గడిచినా, సీసీ కెమెరాల్లోని ఫుటేజీల్లో దుండగుల ఆధారాలు లభించినా, నిందితులను ఇంకా పోలీసులు పట్టుకోలేక పోయారంటూ ఎమ్మెల్యేలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. గంటపాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి పరిషత్ కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించకుంటే ఏబీవీపీకి మద్దతుగా బీజేవైఎంతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
సీపీ హామీతో ధర్నా విరమణ...
విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అదే విధంగా కాచిగూడ ఏసీపీ సీహెచ్.లక్ష్మీనారాయణ, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ ఎస్.సంతోష్ కిరణ్‌లు సిబ్బందితో అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏబీవీపీ క్షేత్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘటన కార్యదర్శి పగుడాకుల బాలస్వామి, ఏబీవీపీ నగర అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ నాయిని బుచ్చిరెడ్డి, బీజేవైఎం నేతలు కళ్యాణ్, వీరబాబు, సోలంకి శ్రీనివాస్, కడియం రాజుతోపాటు మాజీ ఏబీవీపీ నేతలు భారీగా హాజరై మద్దతు పలికారు. అంబర్‌పేట నియోజక వర్గం నాయకులు పి.గోవర్ధన్ రెడ్డి, మహేశ్, నర్సింగ్‌రావు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.