నాటి అశక్తతకు నేడు సంబరాలు
జాతిహితం
కొన్ని వాక్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటికి కర్త ఎవరనే విష యమే ఒక వివాదమై కూచుంటుంది. ‘‘యుద్ధంలో మొట్టమొదట హతమ య్యేది సత్యమే’’ అనేది అలాంటి గొప్ప వాక్యమే. దీని రచయిత ఎవరని ‘గార్డియన్’ పత్రిక ప్రశ్నిస్తే... పాఠకులు అనేక శతాబ్దాల గతంలోకి తరచి చూసి మరీ పలువురి పేర్లను సూచించారు.
ఒంటరితత్వ (ఐసోలేషనిస్ట్) విదేశాంగ విధానవాది, అమెరికన్ సెనేటర్ హిరమ్ వారన్ జాన్సన్ (1918), ఇంగ్లిష్ కథకుడు రుడ్యార్డ్ కిప్లింగ్ల నుంచి ప్రాచీన చైనా యుద్ధ నీతిజ్ఞుడైన సున్ జు వరకు వారిలో ఉన్నారు. అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే పేరు సైతం అనివార్యంగా ఆ జాబితాకు ఎక్కింది. మాబోటి సాహిత్యేతరులం మాత్రం ఈ నానుడిని ఫిలిప్ నైట్లీ రాసిన చక్కటి పుస్తకం ‘ద ఫస్ట్ క్యాజు వాల్టీ’లో చూశాం. అయితే దీనిపై కాపీరైటు మాత్రం జగజ్జేత అలెగ్జాండర్ కంటే చాలా ముందటివాడైన గ్రీకు నాటకకర్త ఏసైలస్కు (క్రీ.పూ. 525-456) చెందాల్సిందే.
ఆ నానుడిని అనుసరించే ఇతర యుద్ధ నియమాలూ వస్తాయి. మొత్తంగా చూస్తే చరిత్ర ఎప్పుడూ విజేతల దృక్పథం నుంచి లిఖించినదిగానే ఉంటుంది. పరాజితులు కాలక్రమంలో ఓటమికి సరికొత్త సాకులను కనిపెడుతుంటారు. అయితే, ప్రతిష్టంభనతో ముగిసిన యుద్ధం విషయంలో ఏళ్లు గడిచే కొద్దీ ఇరు పక్షాలూ నిజాలను ఊచకోత కోస్తూ పోతుంటాయి. అలాంటప్పుడు ఆ యుద్ధ చరిత్ర సంక్లిష్టంగా మారుతుంది. బహుశా ఇరు పక్షాలూ విజయం సాధించామని చెప్పుకోవడమే ఎక్కువగా జరగొచ్చు.
1965లో పాకిస్తాన్, భారత్‌ల మధ్య జరిగిన మొట్టమొదటి, దాదాపు పూర్తి స్థాయి యుద్ధం విషయంలో ఇప్పుడు రెండు దేశాలూ చేస్తోందదే. ఆ యుద్ధంలో నావికా బలగాలు ఇంచుమించుగా పాల్గొననే లేదు. కాబట్టే దాన్ని దాదాపు పూర్తి స్థాయి యుద్ధం అంటున్నాం. ఆ 22 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పుడూ తామే విజయం సాధించినట్టు చెప్పుకుంటోంది, సెప్టెంబర్ 6ను అది పాకిస్తాన్ రక్షణ దినోత్సవంగా పాటిస్తోంది. ఆ రోజున వారి సేనలు భారత సైన్యం, వైమానిక దళాల వెన్నును ‘‘విరిచేయడం’’ అందుకు కారణం కావచ్చనిపిస్తుంది.
భారత్ అంతకంటే మరింత పరిణతి సాధించినది, ఆచితూచి మాట్లా డేది. కాబట్టి ప్రతిష్టంభన అనే భావనకు సాధారణ ఆమోదం లభిస్తోంది. ఆ యుద్ధం విషయంలో మన అధికారిక చరిత్ర సైతం పెద్దగా అతిశయోక్తులకు తావులేనిదిగా ఉండటం చెప్పుకోదగిన విషయం.
ఉద్వేగభరితమైన యుద్ధానంతరపు తొలి రోజుల్లో ఢిల్లీ రైసినా హిల్స్ లోని ప్రధాన కూడలికి ‘విజయ్ చౌక్’ అని పేరు పెట్టిన మాట నిజమే. అయితే ఆ తదుపరి ఆ యుద్ధాన్ని గురించి చాలా వరకు మరచిపోయాం. కానీ ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లు కావస్తున్న సందర్భంగా నేడు అది తిరిగి ముందుకు వస్తోంది. కశ్మీర్ యూరి సెక్టార్‌లోని హాజీ పీర్ కనుమను 1965 ఆగస్టు 28న మన సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ రోజుతో ప్రారంభించి నెల రోజుల పాటూ విజయోత్సవాలు జరగనున్నాయి. 1965లో పూర్తి స్థాయి యుద్ధం బద్దలు కావడానికి నాలుగు రోజుల ముందు మన సైన్యం సాధించిన ఆ విజయం అద్భుతమైనది. అర్ధ శతాబ్ది గడచిన తర్వాత ఇప్పుడు ఆ ఘటనను గురించి సరికొత్త కాల్పనిక గాథలు అల్లడం ఖాయం. నిజాన్ని మూకుమ్మడిగా హతమార్చడంతోనే ఆ క్రమం ముగుస్తుందనేదీ ఖాయమే.
పాకిస్తాన్ సైన్యం తాము ఓడిపోని ఆ ఒకే ఒక్క యుద్ధాన్నే పట్టుకు వేలాడక తప్పడం లేదు. అందుకు భిన్నంగా 1971 యుద్ధంలో భారత్ సాధించిన విజయం నిర్వివాదమైనది. ఆ తదుపరి సియాచిన్, కార్గిల్ వంటి చిన్న విజయాలను సైతం అది సాధించింది. అయితే మన దేశంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్మాదభరితమైన జాతీయవాద వెల్లువ పెరుగుతోంది. రెండు ప్రజాస్వామ్య దేశాల్లో, వాటి చరిత్రలోని అతి సుదీర్ఘ శాంతి కాలాల నడుమనే సైనికవాదం ఎలా తలెత్తగలుగుతుందో చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది. ఇంతకూ ఇప్పుడు మనకు కావాల్సింది నూతన విజయోత్సవ కవాతులు. ఇక వాస్తవాలంటారా, వాటి గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు.
1965 యుద్ధమే ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లోకెల్లా బాగా వెనుకటిది. అయినా 1971 కంటే, ఆ యుద్ధ చరిత్రనే ఇరు పక్షాలు మెరుగ్గా నమోదు చేశాయి. ఆ యుద్ధంలో ఇరు పక్షాలకూ నేతృత్వం వహించిన సైనికాధికారులు... బ్రిటిష్ సంప్రదాయక శిక్షణ పొందినవారు కావడమే అందుకు కారణం కావచ్చు. సైనిక సాహిత్య రచనకు బ్రిటిష్ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం లభించేది. పాకిస్తాన్లో వ్యాప్తిలో ఉన్న గాథల్లో కంటే వాస్తవానికి సీనియర్ పాకిస్తానీ కమాండర్ల కథనాల్లోనే కాల్పనికత తక్కువ. ఆనాటి యుద్ధం గురించి ప్రధానంగా మూడు అంశాలకు సంబంధించిన కథనాలు అక్కడ వ్యాప్తిలో ఉన్నాయి.
ఒకటి. భారతదేశమే యుద్ధం ప్రారంభించింది. రెండు, సంఖ్య రీత్యా, సాయుధ సంపత్తి రీత్యా భారీ బలాధిక్యత ఉన్నా భారత్ ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే... శాంతి కోసం అది ప్రాధేయపడింది. మూడు, ముస్లిం సేనలతో ‘‘హిందూ’’ సేనలు పోరాడలేవని మరోమారు రుజువైంది. ఇక భారత్ వైపునకు వస్తే, పాకిస్తానే యుద్ధాన్ని ప్రారంభించిందనడంలో అనుమానమే లేదు. కశ్మీర్‌ను కాపాడుకోవాలని తప్ప, భారత్‌కు మరో ఉద్దేశమేదీ నిజానికి లేదు. అయితే యుద్ధం మొదలయ్యాక రోజులు గడిచేకొద్దీ పాకిస్తాన్ సైన్యానికి వీలైనంత ఎక్కువ నష్టం కలుగజేయాలనే ఉద్దేశం ఏర్పడింది. పాకిస్తాన్‌కు అమెరికా సరఫరా చేసిన సాయుధ సంపత్తి ఆధిక్యత ఎంతనే విషయంలో ఆనవాయితీగా అతిశయోక్తుల జోడింపూ ఉంది. ఏదేమైనా ప్రతిష్టంభనతో యుద్ధం ముగిసిందనే భావనే మన దేశంలో విస్తృతంగా ఆమోదం పొందింది. ఇప్పుడు దాన్ని విజయం సాధించినట్టుగా మార్చి, పునరూహా గానాలు చేయడం పూర్తిగా అనవసరం.
ఆ యుద్ధానికి సంబంధించి భారత్ చేసిన నాలుగు నిర్ధారణల్లో మూడున్నర కచ్చితమైనవే. యుద్ధ సామగ్రి విషయంలో పాకిస్తాన్‌కు కొంత ఆధిక్యత ఉండిన మాట నిజమే. అయితే అది బలాబలాలను తారుమారు చేసేపాటిది కాదు. ఇక పాకిస్తానే యుద్ధాన్ని ప్రారంభించిందనే విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు, పాకిస్తానీ రచయితలు కూడా కచ్చితంగా నమోదు చేశారు. 1962 చైనా యుద్ధంలో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 1965 మొదట్లో కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ చొరబాటుకు భారత్ ఊగిసలాడుతూ ప్రతిస్పందించింది. ఈ అంశాల ప్రాతిపదికపైనే పాకిస్తాన్ పరిస్థితిని తప్పుగా అంచనా వేసింది. పైగా, కశ్మీరీల తిరుగుబాటుకు పరిస్థితులు పరిపక్వమయ్యాయని అది భావించింది.
ప్రత్యేకించి 1963 చివర్లో జరిగిన హజ్రత్బల్ ఘటన తదుపరి కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు రగులుతూ ఉండటం వాటికి తోడైంది. ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ పేరిట వేలాది మంది సుశిక్షితులైన చొరబాటుదార్లను (మఫ్టీలోని రెగ్యులర్ సైనికులు) కశ్మీర్లోకి పంపి, అదే సమయానికి తిరుగుబాటును ప్రేరేపించే ప్రయత్నా లను పాకిస్తాన్ చేసింది. దీంతో యుద్ధం ప్రారంభమైంది. కానీ ఆ ఆపరేషన్ విఫలమైంది. ప్రత్యేకించి, కశ్మీరీలు తిరుగుబాటు చేయలేదు. భారత సైన్యం అనూహ్యమైన తీవ్రతతో చొరబాటుదార్లపై ప్రతిచర్యకు దిగింది. చివరకు మన సైన్యం వర్షపు రాత్రి సంప్రదాయక పర్వత దాడిని సాగించి హాజి పీర్ కనుమను స్వాధీనం చేసుకుంది. దీంతో పాకిస్తాన్ యుద్ధ పథకంలోని రెండవ భాగమైన ‘ఆపరేషన్ గ్రాండ్ స్లామ్’ మొదలైంది. ఇది సాయుధ శకటాలు, కాల్బలాలతో ఛాంబ్ ప్రాంతం పొడవునా చేపట్టిన పూర్తిస్థాయి దాడి. ఆఖ్నూర్ను స్వాధీనం చేసుకొని, మిగతా భారతదేశంతో కశ్మీర్ లోయకున్న సంబంధాలను పూర్తిగా తెగిపోయేలా చేయడం దీని లక్ష్యం. అక్కడున్న ఒకే ఒక్క భారత బ్రిగేడ్ ఈ దాడిని నిలవరించలేకపోయింది.
ఆవేశపూరితమైన ప్రతిస్పందనగా వైమానిక బలగాలను రంగంలోకి దించడం కూడా ఘోరంగా విఫలమైంది. పాక్ సేనలపై గగనతలం నుంచి కాల్పులు జరపడం కోసం తొలివిడత పంపిన పాత ‘వాంపైర్’ విమానాలు నాలుగింటినీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో రెండు రోజులపాటూ పాకిస్తాన్ సైనిక పథకంలోని రెండో భాగం అనుకున్నట్టే సాగింది. కశ్మీర్, పాకిస్తాన్ చేతికి చిక్కినట్టే అనిపించింది.
సరిగ్గా ఈ సమయంలోనే భారత్ పంజాబ్‌లోని లాహోర్, సియాల్కోట్ సెక్టార్ల పొడవునా రెండు కొత్త యుద్ధ రంగాలను తెరిచింది.
పాకిస్తాన్ తన ప్రధాన భూభాగాన్ని రక్షించుకోవడం కోసం బలగాలను వెనక్కు పిలవక తప్పని పరిస్థితిని కల్పించి, కశ్మీర్‌పై ఒత్తిడి తగ్గేలా చేయడానికి మించి ఈ దాడుల్లో భారత్‌కు మరే వ్యూహాత్మక లక్ష్యమూ లేదు. రాత్రికి రాత్రే మన సేనలు ఈ లక్ష్యాన్ని సాధించాయి. దీంతో వాఘా సరిహద్దును దాటి లాహోర్ శివార్లకు చేరుకున్న మన 15వ డివిజన్ యూనిట్లు ఆ తదుపరి చేయాల్సిందేమిటనే విషయంలో తగు ఆలోచననుగానీ, తెగింపునుగానీ చూపలేకపోయాయి. తమ పురోగమన వేగానికి తామే దిగ్భ్రాంతి చెందిన స్థితిలో అవి ఉన్నాయి. కేంద్రీకృతమైన, వ్యూహాత్మక చింతనను గానీ లేదా స్థానికంగా ఎత్తుగడలపరమైన మెరుపు వేగాన్ని గానీ పదర్శించలేకపోయాయి.
ఇక ఇతర సెక్టార్లకు సంబంధించి, భారత్ తన ప్రధాన బలగాలను సియాల్కోట్ సెక్టార్లోనే మోహరించింది. ఆ రంగంలో మన మొదటి ఆర్మర్డ్ (ట్యాంకులు తదితర సాయుధ శకటాలు) డివిజన్ తీవ్రంగా పోరాడింది, కానీ నిజానికది ‘‘అడుగడుగునా సంకుల సమరం సాగించాల్సిన’’ ఆలోచనారహితమైన పోరు మాత్రమే. భారత పక్షం నుంచి ఆ యుద్ధంపై ఇంత వరకు వెలువడిన అత్యుత్తమ కథనం దివంగత లెఫ్టినెంట్ జనరల్ హర్బక్ష్సింగ్ రాసినదే. ఆయన అప్పట్లో మన వెస్ట్రన్ కమాండ్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (జీఓసీ ఇన్ సీ). ఇంచుమించుగా యుద్ధానికంతటికీ ఆయనే నేతృత్వం వహించారు. చురుక్కుమనిపించేలా అత్యంత నిజాయితీగా రాసిన కథనాల్లో అది ఒకటి. ‘‘పరస్పరం ఒకరి భుజాలు ఒకరు చరుచుకునే పని మేం చాలానే చేశాం. వాస్తవికమైన అంచనా దేన్నయినా దేశభక్తియుతమైనది కానిదిగా ఆ రోజుల్లో ఈసడించి ఉండేవారే’’ అని ఆయన తన ‘‘వార్ డిస్పాచెస్’’ ముగింపులో (పేజీ 214) పేర్కొన్నారు. అయితే అంతా సద్దుమణిగాక, ఉద్వేగం వెల్లువెత్తుతున్న పరిస్థితి తొలిగాక... ‘‘ఉప్పొంగిపోవడం స్థానే భ్రమలు తొలగిన భావన’’ మన బలగాలను, ప్రత్యేకించి ప్రధాన దాడి బలగాలను ఆవహించింది.
పాకిస్తాన్ వైపున ఇలాంటి వాస్తవికవాద దృష్టి ఉన్నట్టు మనకు కనబడలేదు. పాకిస్తాన్ సేనలు అత్యంత సుసంసిద్ధంగా స్పష్టమైన, భారీ లక్ష్యాలతో రంగంలోకి దిగాయి. ఖేమ్కరన్లో ట్యాంకులతో భారీ దాడి సాగించడమే వారి వ్యూహంలోని అత్యంత కీలకాంశం. ఇక ఎత్తుగడలపరమైన తెగింపు పాకిస్తాన్ సైన్యంలో ఎప్పుడూ కనిపించే విశిష్టత. లాహోర్ సెక్టార్లో భారత్ బలగాలను పక్కల నుంచి ముట్టడించి, బియాస్‌ను దాటాలనేది వారి లక్ష్యం. ఆపై ఢిల్లీకి చేరినా చేరొచ్చు, ఎవరు చెప్పగలరు? తొలుత సాధించిన విజయాలతో ఉప్పొంగిపోయిన నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ అంత పనీ చేస్తామని ప్రగల్భాలు పలికారు కూడా. 1962లో తుడిచిపెట్టుకుపోయి, ఆ తర్వాత పునర్నిర్మితమైన మన 4వ డివిజన్ దృఢ సంకల్పంతో ఆసల్ ఉత్తర్ రణ రంగంలో పాకిస్తాన్ ఒకటవ ఆర్మర్డ్ డివిజన్‌ను నాశనం చేసేసింది.
అదే ఆ యుద్ధంలో భారత్ సాధించిన ప్రధాన విజయం. దీంతో పాకిస్తాన్ వ్యూహం త్వరలోనే భగ్నమైంది. పాకిస్తాన్ వైఫల్యం దాని దాడి ఎత్తుగడల్లో ఉంది. ఆ యుద్ధమంతటిలో పాకిస్తాన్ ఛాంబ్, ఖేమ్కరన్లలో నిజంగానే సాహసోపేతమైన రెండు సైనిక చర్యలను జరిపింది. ఒకటి పరిమితంగా విజయవంతం కాగా, రెండవది ఘోరంగా విఫలమైంది. భారత్, కశ్మీర్ యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రధాన భూభాగానికి విస్తరింపజేయదనే అంచనాయే దాన్ని ఛాంబ్ దాడికి పురిగొల్పింది. ఆ భ్రమ దానికి ఇంకా కొనసాగుతూనే వచ్చింది. 1999 కార్గిల్ యుద్ధంలో సైతం అది స్పష్టమైంది.
యుద్ధంపై ఉన్న వ్యాఖ్యల్లోకెల్లా నాకు అత్యంత ఇష్టమైనది అటల్ బిహారీ వాజపేయి వ్యాఖ్యే. గతంలో సైతం నేను దాన్ని ఉల్లేఖించాను. పార్లమెంటుపై జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో 2000-01 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య యుద్ధం వంటి పరిస్థితి నెలకొంటుండగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు: ‘‘యుద్ధానికి సంబంధించి అసలు సమస్య ఏమిటంటే దాన్ని ఎప్పుడు, ఎలా ప్రారంభిస్తామనేది మీ చేతుల్లో ఉంటుంది. కానీ అది ఎప్పుడు, ఎలా, ఎక్కడ ముగుస్తుందో మాత్రం మీరు ఎన్నటికీ చెప్పలేరు.’’ ఆగ్రహంతో ఉన్న మన సైనికాధికారులను ఆయన ‘‘మనం యుద్ధానికి దిగగలమనేది నిస్సందేహం. అయితే రేపు ఈ యుద్ధ చరిత్రను లిఖించేటప్పుడు దీన్ని ఏ యుద్ధమని పిలుస్తారు, యుద్ధ లక్ష్యం ఏమిటని రాస్తారు? ఆగ్రహ యుద్ధమని మాత్రమే దీన్ని పిలవాల్సి వస్తుందా?’’ అని ప్రశ్నించారు.
1965 యుద్ధం ఎలా, ఎందుకు ముగిసిందో మనకు తెలిసిందే. ఇరు పక్షాలు అలసి, విసుగెత్తి పోయాయి. సైనికపరంగా ఇక కొత్త ఆలోచనలే కరువయ్యాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మందుగుండుకు కొరత ఏర్పడి అది ముగిసింది. ఇరు పక్షాలూ తమ లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్నీ సాధించలేక విఫలమయ్యాయి. తదుపరి మరో దఫా యుద్ధానికి సన్నద్ధం కావడం ప్రారంభించాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్‌కు సంబంధించి దాన్ని నిలవరించడం తప్ప, మరే ఇతర సైనిక లక్ష్యాలూ భారత్‌కు మిగల్లేదు. కాబట్టే మన దేశం ఆర్థిక వ్యవస్థను దృఢంగా నిర్మించుకోగలిగింది. బలీయమైన ఐక్యతతో భారత సమాజంలో శాంతిని నెలకొల్పగలిగింది. ఒక అంతర్జాతీయ శక్తిగా ఎదిగింది. సాధించలేకపోయిన సైనిక లక్ష్యాలన్నీ పాకిస్తాన్ సైన్యం పక్షానే ఉన్నాయి. 1965 నుంచి అవి మారలేదు.
కాబట్టి ఆనాటి యుద్ధానికి సంబరాలే జరుపుకుంటారో లేక విచారపడతారో వారికే వదిలిపెట్టండి. వాజపేయి అన్నట్టు, యుద్ధానికి ఓ పేరంటూ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి నేనెప్పుడూ దాన్ని ‘‘పరస్పర అశక్తతల యుద్ధం’’అనే అంటాను. మనం చేయాల్సిందల్లా ముందుకు సాగడమే, లేదంటే ముందుకు సాగుతూనే ఉండటమే.
- శేఖర్ గుప్తా
shekhargupta653@gmail.com