
న్యూఢిల్లీ: మార్కెట్లలోకి ప్రవేశించలేకపోవడం, కస్టమర్లను కాపాడుకోవడం, తమ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేసుకోలేకపోవడం వంటి ప్రధాన సవాళ్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఎదుర్కొంటున్నాయి. మార్కెటింగ్‌కు సంబంధించి సవాళ్లు వాటి వృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. ఈ వివరాలను ‘కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్’(ఐసీఆర్‌ఐఈఆర్) సర్వే తెలిపింది.
2022 నవంబర్ 4 నుంచి 2023 జనవరి 20 మధ్య కాలంలో 2,007 ఎంఎస్‌ఎంఈల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఇందులో 65 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 19 శాతం చిన్నవి కాగా, 16 శాతం మధ్య స్థాయి సంస్థలు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను విక్రయ మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్న ఎంఎస్‌ఎంఈలు ప్రధానంగా యువ, విద్యావంతులైన వారి నిర్వహణలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది.
ఇతర ఎంఎస్‌ఎంఈలతో పోలిస్తే, ఎగుమతి ఆధారిత ఎంఎస్‌ఎంఈలలో అధిక శాతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై ఉన్నాయి. ఎగుమతుల పట్ల అవగాహన కలిగిన సంస్థలు, ఈ కామర్స్ సేవల వినియోగానికి అనుకూలంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. సమీకృత ఎంఎస్‌ఎంఈలు పనితీరు, టర్నోవర్, లాభదాయకత, ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఐసీఆర్‌ఐఈఆర్ నివేదిక తెలిపింది. సదుపాయాల కొరత, రుణ సాయం లభించకపోవడం, నిపుణులైన కార్మిక శక్తి, ఆలస్యపు చెల్లింపులు ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
ఈ కామర్స్‌తో అవకాశాల విస్తరణ..
సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 1,005 ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమయ్యాయి. మిగిలిన 1,002 ఈ కామర్స్‌పై నమోదు కానివి. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం కావడం వల్ల కేవలం మార్కెట్ విస్తరణ అవకాశాలు పెరగడమే కాకుండా, రుణ సదుపాయానికి అవకాశం ఉంటుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. సమ్మిళిత వృద్ధికి ఎంఎస్‌ఎంఈలు కీలకమని పేర్కొంటూ.. అవి డిజిటల్‌గా పరివర్తనం చెందడం ఎంతో అవసరమని ఈ సర్వే ప్రస్తావించింది. ఈ కామర్స్ వేదికల ద్వారా మరిన్ని భౌగోళిక ప్రాంతాలకు విస్తరించే అవకాశాల పట్ల ఎంఎస్‌ఎంఈల్లో అవగాహన ఉన్నట్టు పేర్కొంది.
ఎంఎస్‌ఎంఈలు టెక్నాలజీ సాయంతో మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకునేందుకు, వాటికి ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర రుణ హామీ పథకం తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా, వాటి మధ్య స్థిరీకరణ అవసరమని ఎంఎస్‌ఎంఈలు అభిప్రాయపడ్డాయి. విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అసవరాన్ని కూడా ప్రస్తావించాయి. సమగ్ర ఎంఎస్‌ఎంఈ విధానం ఉండాలని, ఒకే వేదికగా అన్ని ప్రయోజనాలు పొందేలా అవకాశం కలి్పంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రయోజనాల పట్ల ఎంఎస్‌ఎంఈల్లో అవగాహన కలి్పంచాలని కూడా అభిప్రాయపడ్డాయి.