![MSMEs optimistic about business growth in July to December - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/15/MSME.jpg.webp?itok=o9I-L0QJ)
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) వ్యాపార ఆశావహం పుంజుకుంది. 2022 డిసెంబర్ వరకు ఆరు నెలల్లో వ్యాపార వృద్ధి పట్ల 71 శాతం ఎంఎస్‌ఎంఈలు సానుకూలంగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వ్యాపారం కుంటుపడొచ్చని కేవలం 5 శాతం మందే చెప్పారు. ఫిన్‌టెక్ సంస్థ ‘ఖాతాబుక్’ అర్ధ సంవత్సర ఎంఎస్‌ఎంఈ బిజినెస్ సెంటిమెంట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలతో ఓ నివేదిక విడుదల చేసింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనూ ఎంఎస్‌ఎంఈలో అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాల్లోనూ వృద్ధిని చూసినట్టు ఈ నివేదిక తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఎస్‌ఎంఈల్లో సానుకూల వృద్ధి ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందంజంలో ఉన్నట్టు పేర్కొంది. 2021లో ప్రతికూల వృద్ధిని చూసిన పారిశ్రామిక సేవలు, స్టేషనరీ, హోమ్ ఫర్నిషింగ్ కంపెనీలు సైతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సానుకూల వ్యాపారాన్ని నమోదు చేసినట్టు వివరించింది. 2022 మొదటి రెండు త్రైమాసికాల్లో ఫార్మా, సెలూన్లు, రెస్టారెంట్లు అధిక వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది.
సమస్యలు కూడా తక్కువే..
తమకు వ్యాపారానికి సంబంధించి పెద్ద సమస్యలు ఏమీ లేవని 66 శాతం ఎంఎస్‌ఎంఈలు చెప్పాయి. దీనికి విరుద్ధంగా ఇతర ఎంఎస్‌ఎంఈలు డిమాండ్ బలహీనంగా ఉందని, రుణాల లభ్యత, లిక్విడిటీ సమస్యలను ప్రస్తావించాయి. 7,295 అభిప్రాయాలను సర్వేలో తెలుసుకోగా, 58 శాతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వ్యాపారం మెరుగుపడినట్టు చెప్పాయి. ఇదే కాలంలో వ్యాపారం క్షీణించినట్టు 14 శాతం ఎంఎస్‌ఎంఈలు తెలిపాయి. రిటైలర్లు, హోల్‌సేల్ విక్రేతలు, పంపిణీదారులు, తయారీదారుల్లో వ్యాపార సెంటిమెంట్ బలపడింది.
Comments
Please login to add a commentAdd a comment