పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో మరపురాని జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ బంధాన్ని జీవితకాలం గుర్తుండిపోయేలా భావిస్తారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల కలలకు తగ్గట్టుగా ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడతారు.. ఇందులో భాగంగానే బంధువులు, స్నేహితుల్లో ఎవరూ చేయని విధంగా పెళ్లిజరపాలనే తలంపుతో వైభవాన్ని చాటేలా చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడూ జరుగుతూ ఉన్నా.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు అంచనాలకు మించి ఆకాశాన్నంటుతున్నాయి.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఈ సంవత్సరం పెళ్లిళ్ల సీజన్‌లో కేవలం 23 రోజుల్లో రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది. సదరు నివేదిక ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 35లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ వివాహాల వల్ల సంబంధీకులు జరిపే కొనుగోళ్లు, ఇతర సేవలు కలిపి రూ.4.25లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సర్వే తెలిపింది.
ఈ ఏడాది మొత్తం పెళ్లిళ్లలో 10 శాతం అంటే 3.5 లక్షల పెళ్లిళ్లు ఒక్క దిల్లీలోనే ఉంటాయని అంచనా. మొత్తం వివాహాల్లో 50వేల మంది లగ్జరీ కేటగిరీలో ఉండనున్నారు. వారు కనీసం రూ.1కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తారని నివేదిక చెబుతుంది. మరో 50వేల పెళ్లిళ్లకు ఒక్కో దానికి రూ.50 లక్షల వరకు ఖర్చులు ఉంటాయి. అయితే దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు సుమారు రూ.25లక్షలు ఖర్చు చేయనున్నట్లు సర్వే వెల్లడించింది.
12లక్షల వివాహాలకు రూ.10 లక్షలు, మరో 10 లక్షల వివాహాలకు రూ.6 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. గత సంవత్సరం అదే 23 రోజుల సమయంలో మొత్తం 3.2 మిలియన్ల వివాహాలు జరిగాయి. ఫలితంగా రూ.3.75లక్షల కోట్ల వ్యాపారం నమోదైందని సీఏఐటీ సర్వే చెప్పింది.
మధ్యతరగతి వివాహ వేడుకకు అయ్యే ఖర్చు సుమారుగా ఇలా..
- కల్యాణ మండపం అద్దె(రోజుకు): రూ.2లక్షలు
- పూల అలంకరణ, ఇతర వినియోగాలుఖ: రూ.1.50లక్షలు
- భోజనం నిమిత్తం(క్యాటరింగ్):రూ.1.80క్షలు
- వంట మనుషులు, సహాయకుల ఖర్చులు: రూ.30వేలు
- కిరాణా సరకులు: రూ.60వేలు
- కూరగాయల ఖర్చు: రూ.30వేలు
- సన్నాయి వాయిద్యాలకు: రూ.20వేలు
- డ్రింకింగ్ వాటర్: రూ.2వేలు
- సలాడ్, పాన్, ఐస్‌క్రీం: రూ.25వేలు
- కార్మికులు, సహాయకులకు: రూ.5వేలు
- జనరేటర్: రూ.7వేలు
- విద్యుత్తు లైట్లు, అలంకరణ: రూ.30వేలు
- ఫొటో, వీడియోగ్రాఫర్: రూ.60వేలు
- ఇవికాకుండా బంగారు ఆభరణాలు, బంధువుల కానుకలు అదనం.
Comments
Please login to add a commentAdd a comment