దాడిలో గాయపడ్డ ప్రవీన్, విలేకరులతో మాట్లాడుతున్న సిలువేరు సాంబయ్య
సాక్షి, పరకాల: ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ప్రవీణ్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడికి కొండా దంపతులు బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్(టీఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల నరేందర్, జాతీయ కార్యదర్శి సిలువేరు సాంబయ్య డిమాండ్ చేశారు. పరకాల ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్, సాంబయ్యలు మాట్లాడారు. పరకాల పట్టణంలోని ఎస్సీ కాలనీలో యువకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమైన సమయంలో ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు ప్రవీణ్‌ౖ జోక్యం చేసుకొని వారిని ప్రశ్నించగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్‌ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి వర్గీయులు దాడి చేసినట్లు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ చేసుకున్న బాధితుడు ప్రవీణ్‌పై పిడిగుద్దులు, బండరాయితో బాధినట్లు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలతో ఓట్లు పడుతాయనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాడులు చేసే సంస్కృతికి కొండా మురళి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో దళిత కులాల మధ్య చిచ్చుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పరకాల నుంచి కొండా సురేఖను గెలిపిస్తే ప్రజలకు నష్టం తప్ప ఎలాంటి న్యాయం జరగదన్నారు. ప్రవీన్‌పై దాడి చేసిన నిందితులను తక్షణమే చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈదునూరి సారయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి బాబు, మహబూబ్‌నగర్, జనగాం జిల్లా అధ్యక్షులు పందుల సంజీవ, గద్దెట రమేష్, జనగాం జిల్లా అధ్యక్షుడు గడపెంగి ప్రవీణ్, యువసేనా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇల్లందుల రాజేష్ కన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment