దూకుడు తగ్గించుకో..
ఏఎస్పీకి కలెక్టర్, ఎస్పీ క్లాస్
విశ్వజిత్ తీరుపై సీఎం కార్యాలయం ఆరా
డీజీపీకి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఫిర్యాదు
వరంగల్ : మేడారం జాతరలో వివాదాస్పద పోలీసు అధికారిగా ముద్రపడిన ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి తీరుపై సీఎం కార్యాలయం స్పందించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో అత్యవసర వైద్యసేవ లందించేందుకు వెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి... డ్రైవర్, వైద్యుడు, సీనియర్ జర్నలిస్ట్‌ను దారుణంగా కొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. బుధవారం జరిగిన ఈ ఘటన, ఏఎస్పీ విశ్వజిత్ పనితీరుపై సమాచారం పంపించాలని ఎస్‌బీ అధికారులను ఆదేశిం చింది. మరోవైపు డీజీపీ కార్యాలయం కూడా ఈ సంఘట నపై జిల్లా అధికారులను వివర ణ అడిగినట్లు తెలిసింది.
ములుగు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వజిత్ పనితీరు కొంత ఇబ్బందిగానే ఉందని పోలీసు వర్గాలు సమాచారం రూపొందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మేడారం జాతర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర మంత్రులు స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ములు గు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి అస్వస్థతతో ఉన్న మహిళను తీసుకెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి.. ఇద్దరు ఉద్యోగులను దారుణంగా కొట్టడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో తదుపరి చర్యల కోసం సమగ్ర సమాచా రం సేకరిస్తోంది. మరోవైపు బుధవారం జరిగిన ఘటనపై రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జిల్లా కలెక్టర్ కరుణ విశ్వజిత్ కాంపాటిని మందలించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అంకితభావం కంటే స్వీయ నియంత్రణ ముఖ్యమని సూచించినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
తొలి నుంచి వివాదాస్పదమే..
ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందనే అభిప్రాయం ములుగు ప్రాంతంలో ఉంది. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఏఎస్పీ స్వయంగా తమ ను కొట్టారని మంగపేటకు చెందిన అధికార టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. భూమి విషయంలో తమను కొట్టిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని మంత్రి చందులాల్‌ను కోరారు. మేడారం ఘటన నేపథ్యంలో ఈ వివరాలను కూడా సేకరిస్తున్న ట్లు తెలిసింది. విశ్వజిత్ ఓసారి లక్నవ రం సరస్సుకు వెళ్లినప్పుడు బోటింగ్ ఆలస్యమైందనే కారణంతో స్థానిక పోలీ సులు బోటింగ్ నిర్వాహకులను ఒక రోజంతా పీఎస్‌లో పెట్టి కొట్టారని ఎస్ బీ అధికారులకు సమాచారం ఉంది. ఈ అన్ని అంశాలతో ఎస్‌బీ విశ్వజిత్‌పై నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిసింది.
కాగా, వరంగల్‌లో సీనియర్ జర్నలిస్టు పాశం యా దగిరిపై ఏఎస్పీ విశ్వజిత్ దాడి చేసిన విషయమై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన డీజీపీని కలిశారు.