అధికారమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్
టీ బీజేపీ నేతలకు అమిత్ షా ఉద్బోధ
న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా 2018 నాటికి మార్గదర్శక ప్రణాళిక (రోడ్ మ్యాప్) సిద్ధం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరుబా ట పట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ సాధిం చిన ఫలితాలను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులతో కలసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ లక్ష్మణ్, నేతలు శ్రీనివాసరావు, రాంచందర్‌రావు తదితరులు అమిత్‌షాతో సమావేశమయ్యారు.
సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కార్యాచరణను తెలియచేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును అమిత్‌షా అభినందించారు. ఈ భేటీ అనంతరం దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు విలేకరులతో మాట్లాడుతూ ‘‘చేతివృత్తులు, బలహీనవర్గాలవారిని పార్టీలో చేర్పించే కార్యక్రమం నిర్వహించాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజ లకు వివరించాలని అమిత్‌షా సూచించారు’’ అని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరగలేదని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఎన్డీయేలోకి టీఆర్‌ఎస్ చేరుతుందనే విషయమై అడ గ్గా.. ఆ పార్టీతో సయోధ్య విషయంలో రాష్ట్ర, జాతీయ స్థాయి లో ఎక్కడ చర్చ జరగలేదని బదులిచ్చారు.