అకడమిక్ పరంగా స్వయం ప్రతిపత్తి
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
ఆమోదమే తరువాయి..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి అటానమస్ హోదా లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పంపిన లేఖ సోమవారం అందింది. వచ్చే విద్యాసంవత్సరం(2016-2017) నుంచి ఈ హోదా అమలులోకి రానుంది. ఈ ఏడాది జులై 27, 28వ తేదీల్లో యూజీసీ నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆర్ట్స్ కాలేజీని సందర్శించి వసతులు, సౌకర్యాలపై ఆరా తీసింది. వారు ఇచ్చే నివేదిక ప్రకారం ప్రస్తుతం అటానమస్ హోదా లభించింది. తద్వారా ఆర్‌ట్స కాలేజీ కేయూ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లవచ్చు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సులలో సిలబస్ రూపకల్పనతోపాటు విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల సెట్టింగ్, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల సొంతంగా చేసుకోవచ్చు. టైంటేబుల్ కూడా యూనివర్సిటీతో సంబంధం లేకుండా సొంతంగా చేసుకునే వెసలుబాటు లభిస్తుంది. నిధులు కూడా యూజీసీ నుంచి నేరుగా అందనున్నందున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు. అయితే, కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆర్థికపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. అలాగే, ఆర్ట్స్ కాలేజీకి లభించిన అటానమస్‌కు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఆమోదించాల్సిన అవసరముంది.
మినీ యూనివర్సిటీ
కాకతీయ యూనివర్సిటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మినీయూనివర్సిటీగా పిలువబడుతుంది.40 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అనేక భవనాలతో మౌళిక వసతులు కలిగి ఉండగా 1927లో కాలేజియట్ హైస్కూల్‌గా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. డిగ్రీ కోర్సులతో 1959లో ఓయూ పరిధిలో ఉండి ఆ తరువాత 1976 అగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. 1995నుంచి పీజీ కోర్సులు కూడా నిర్వహిస్తుండగా.. మాజీ ప్రధాని దివంగత పీవీ.నర్సింహారావు తదితరులెందరో ఈ కళాశాలలో చదువుకున్నారు. కాలేజీలో ప్రస్తుతం 30 వరకు వివిధ కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, పది పీజీ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు నడుస్తున్నాయి. అలాగే, ఈ కళాశాలకు 2004లో తొలిసారి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించగా.. 2014-2015లో రీ అక్రిడేషన్ లభించింది.
రెగ్యులర్ అధ్యాపకుల నియమాకం అవసరం
యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి అన్ని హంగులున్నా ఉ ద్యోగ విరమణ చేస్తున్న ప్రొఫెసర్ల స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. దీంతో 90మంది రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు కేవలం 23మందే ప్రస్తుతం ఉ న్నారు. మిగతా వారందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లే. ప్రస్తు తం అటానమస్ హోదా లభించినందున ఆర్‌ట్స కళాశాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమిస్తేనే అటానమస్ హోదా లభించిన ఫలితం దక్కుతుంది.
రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చాం..
అటానమస్ ఆర్ట్స్ అండ్‌ై సెన్స్ కాలేజీకి అటానమస్ హోదా కల్పిస్తూ యూజీసీ నుంచి వచ్చిన లేఖను కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ అల్తాఫ్ హుస్సేన్‌కు ఇచ్చామని కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.రామానుజరావు తెలిపారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోఆమోదించేలా యూనివర్సిటీ అధికారులు కృషి చేయాల్సి ఉంది.
అటానమస్ ఆర్ట్స్ కాలేజీ
Published Wed, Oct 28 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM
Advertisement