ఆయుష్మాన్‌ భవ | Ayusmanbhava | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్‌ భవ

Published Sat, Sep 13 2014 12:53 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

Ayusmanbhava

  •  రేపటితో గాంధీ మెడికల్ కళాశాలకు 60 వసంతాలు
  •  పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
  •  నాడు పీపుల్స్.. నేడు గాంధీ
  •  మెరుగైన వైద్య సేవలకు నిలయుం
  • రోగం వచ్చిందంటే ఊరంతా భయమే.. ఏ ఇల్లు చూసినా మూలుగుతున్న వారే.. దవాఖానాలు ఎక్కడో ఉండేవి.. వైద్యుల వద్దకు వెళ్లాలంటే సాహసమే.. ఇది ఒకప్పటి మాట. అప్పట్లో వైద్య విద్యకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా డాక్టర్లు.. క్లినిక్‌లు.. కార్పొరేట్ ఆస్పత్రులు.. ఎన్నో ఏళ్లుగా వేల మంది డాక్టర్లకు వైద్య విద్య బోధించి ప్రపంచమంతా డాక్టర్లను పంపించిన ఘనత ‘గాంధీ’ కళాశాలకు సొంతం. కాలేజీకి అనుసంధానంగా ఉన్న గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. ప్రాణాపాయంలో ఉన్నా.. మొదట గుర్తొచ్చేది గాంధీ హాస్పిటలే.. అత్యాధునిక సౌకర్యాలతో ప్రతిరోజూ వేలమంది బయటి రోగులు.. వందల సంఖ్యలో లోపలి రోగులకు ఉన్నత వైద్య సేవలందిస్తూ పేదలపాలిట ‘సంజీవని’గా మారింది.
     
    గాంధీ ఆస్పత్రి:

    నిష్ణాతులైన వైద్యులను తయారు చేయడంలో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల అరవై వసంతాలు పూర్తి చేసుకుంది. పీపుల్స్ మెడికల్ కాలేజీగా 1954 సంవత్సరంలో ఆవిర్భవించి తదనంతరం గాంధీ మెడికల్ కళాశాలగా పేరుమార్చుకుని దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచింది. రోగాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు దేశంలోని నలుమూలలతోపాటు ఇతర దేశాలలోనూ వైద్యసేవలను అందిస్తున్న వేలాదిమంది నిష్ణాతులైన వైద్యులు స్టెతస్కోప్ పట్టుకుని వైద్యభాషలో ఓనమాలు దిద్దింది ఇక్కడే. ప్రజల సేవ కోసం పీపుల్స్ కాలేజీగా ఆవిర్భవించి, దేశ ప్రజల బానిస సంకెళ్లును తెంచిన మహాత్మాగాంధీ పేరుతో కొనసాగుతూ మెరుగైన వైద్యవజ్రాలను దేశానికి అందిస్తోంది సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ..
     
    ఆవిర్భావం... నగర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో 1954 సెప్టెంబర్ 14వ తేదీన ‘అన్వర్ ఉలామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులతో పీపుల్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వైద్యవిద్య అవసరాలు తీర్చేందుకు అప్పటికే ఉన్న ఉస్మానియా వైద్య కాలేజీ సరిపోకపోవడంతో ప్రస్తుతం ఉన్న సరోజనీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని హుమాయూన్‌నగర్‌లో పీపుల్స్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. కాలేజీ మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్ విధులు నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1955 జూన్ 25న కాలేజీని ప్రారంభించి గాంధీ మెడికల్ కాలేజీగా పేరు వూర్చారు. 1956లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రైవేట్ యాజమాన్యం నుంచి కాలేజీని హైదరాబాద్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది.

    నిర్వహణ బాధ్యతలను ప్రిన్సిపాల్ నిజాముద్దీన్ అహ్మద్‌తోపాటు రిటైర్డ్ మెడికల్ డెరైక్టర్ కల్నల్ కేవీ వాఘ్రేకు అప్పగించింది. కాలేజీని 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ డీవీ సుబ్బారెడ్డిని గాంధీ మెడికల్ కాలేజీ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్‌గా నియమించారు. 2003లో ముషీరాబాద్‌కు తరలించారు. 1950-60 మధ్యకాలంలో కాలేజీని గాంధీ ఆస్పత్రికి అనుసంధానించారు.
     
    సూపర్‌స్పెషాలిటీ కోర్సులు...

    మొదట్లో గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ, ఫిజియాలజీ,, బయోకెమిస్ట్రీ, ఫోరెనిక్స్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పైథాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి 27 విభాగాలలో వైద్యవిద్యను అందించేది. 1970 దశకం నుంచి కార్డియాలజీ, కార్డియోథొరాసిస్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి సూపర్‌స్పెషాలిటీ కోర్సులు కాలేజీలో అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎం వంటి వాటితోపాటు నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో 150, పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) 80 సీట్లు ఉండగా, వైద్యరంగంలోని వివిధ విభాగాలకు చెందిన 37 డిగ్రీలను ఇక్కడ బోధిస్తారు. కళాశాలకు అనుబంధంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఏటా లక్షకు పైచిలుకు అవుట్‌పేషెంట్లు, 60 వేల మంది ఇన్‌పేషెం ట్లకు వైద్యసేవలు అందిస్తోంది. మరో 15 వేలు మేజర్, 25 వేల మైనర్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
     
    ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్..
    గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే అరవై వసంతాల వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అలుమ్నీ భవనంలోని గాంధీ చిత్రపటానికి నివాళులు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణతో పాటు వివేకానంద ఆడిటోరియంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖమంత్రి రాజయ్య, మంత్రులు పాల్గొంటారు.
     
    కళాశాలను మరింత అభివృద్ధి చేస్తా: గాంధీ ప్రిన్సిపాల్ శ్రీలత
     సికింద్రాబాద్ మెడికల్ కళాశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రిన్సిపాల్ ఎస్.శ్రీలత తెలిపారు. తన హయాంలో 60 వసంతాల వేడుకలు జరగడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ చొరవతో కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement