
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే క్యాబ్ డ్రైవర్లపై ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు పాల్పడడం తగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ముదిరాజ్ భవనంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కుటుంబాలను పోషిస్తున్న వారి జీవనోపాధికి అడ్డుతగలడం న్యాయం కాదన్నారు.
ఓ వైపు ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో విఫలమవుతుండడంతో స్వయం ఉపాధితో బతుకుతున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. పోలీసుల ఆగడాలు ఆపకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, క్యాబ్‌డ్రైవర్లు పాల్గొన్నారు.