సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో స్వప్న అనే బీ టెక్ విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. రైల్లో వెళ్తుండగాన ఆమె తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి రైలును జనగాం స్టేషన్లో నిలిపివేశారు. జనగాం స్టేషన్ రైల్వే అధికారులకు వారు సమాచారం అందించారు. దాంతో స్వప్నను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు వెల్లడించారు. దాంతో స్వప్నను అక్కడినుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి అప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకోడానికి ఎందుకు ప్రయత్నించిందో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె వెంటనే బంధువులు కానీ స్నేహితులు లేరు. పోలీసులు ఆమెపై ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన స్వప్నను ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.