రోడ్డెక్కిన రైతులు | baknks collects crop loan intrest: farmers protests | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతులు

Published Wed, Sep 9 2015 5:14 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

baknks collects crop loan intrest: farmers protests

మెదక్: పంట రుణాలకు బలవంతంగా వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకర్ల తీరును నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం దుబ్బాక మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకున్న రైతులు రోడ్డుపై బైఠాయించి, గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా ప్రయాణీకులు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. కేసీఆర్ మంత్రి మండలి ఒక మాట మాట్లాడుతుంటే బ్యాంకర్లు మాత్రం రైతుల నుంచి ముక్కు పిండి వడ్డీని వసూలు చేస్తున్నారని, కొత్త రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ రహస్య ఏజెండా మేరకే బ్యాంకర్లు రైతుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


ఓ బ్యాంకేమో వడ్డీ వసూలు చేస్తుంటే మరో బ్యాంకు అసలు, వడ్డీలను కలిపి వసూలు చేస్తుండడం రైతాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర వర్షాభావంతో పీకల్లోతు కష్టాల్లో కూరకుపోతుంటే పర్యటనల పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విహార యాత్రలకెళ్లడం విడ్డూరమన్నారు. మెదక్ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కన్వీనర్ ఎంగారి రాజిరెడ్డి, పెద్దగుండవెళ్లి ఎంపీటీసీ చందిరి సంజీవరెడ్డి, రైతు సంఘ్ నాయకులు ఆస అంజనేయులు, వడ్ల రాజు, శెట్టి భూపతి, సుంకోజు సుదర్శన్, పల్లె చిన్నికష్ణ గౌడ్, మంద అనిల్‌రెడ్డి, రైతు సంఘాల నాయకులు అమ్మన జీవన్‌రెడ్డి, కొంగరి రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించిన రైతులను లాగేసి పోలీసులు బలవంతంగా ఆందోళనను విరమింపజేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement