నల్లగొండ : నాగార్జునసాగర్ వరద కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వేములపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన సుమారు 100 మంది రైతులు నార్కట్‌పల్లి - అద్దంకి రహదారిపై మాడుగులపల్లి వద్ద రాస్తారోకో చేశారు.
ఆరు మండలాల్లో లక్ష ఎకరాలకు నీరందించే వరద కాల్వ పనులు కిలోమీటర్ మేర ఆగిపోవటంతో ఆరు గ్రామాలకు సాగు నీరు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. దాదాపు గంటసేపు కొనసాగిన ఈ ఆందోళనతో పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.