యూరియా కొరత లేకుండా చూస్తాం
నెల్లూరు(అగ్రికల్చర్): అన్నదాతలను యూరియా కష్టాలు వీడటం లేదు. రైతులు ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయాల వద్ద కాచుకు కూర్చున్నా బస్తా కూడా చేతికి అందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు. శుక్రవారం కూడా జిల్లాలో పలు ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల ఎదుట అన్నదాతలు బారులు తీరారు. రోజంతా యూరియా కోసం క్యూలో నిలబడ్డా బస్తాకూడా అందకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.
వ్యవసాయ శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు అధికార పక్షాల పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జానకి స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అదుపులోకి రాలేదంటే యూరియా సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గత ఏడాది రబీ సాగుకు 96వేల మెట్రిక్ టన్నులు రాగా ఈ ఏడాది ప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది.
అలస్యంగా సీజన్ ప్రారంభం కావడం, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, వచ్చిన ఎరువులు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటం రైతులు కునుకు లేని రాత్రులను గడుపుతున్నారు. సీజన్ దాటిపోతుండటంతో యూరియా కోసం రైతులు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో విఫలం చెందారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
రైతన్న కన్నెర్ర
మనుబోలులోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పీఏసీఎస్‌లో యూరియా కోసం మండుటెండను లెక్క చేయకుండా అన్నదాతలు బారులుతీరారు. రైతులు భారీగా క్యూలో ఉండటంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మకూరు ఎసై రంగంలోకి దిగి రైతులను చెదర కొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సైదాపురంలోని సొసైటీ ఎదుట యూరియాకోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.