సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయిలో కారుణ్య నియామకాలు, పదోన్నతులపై టీసర్కారు త్వరలోనే నిషేధాన్ని సడలించనుంది. ఈ మేరకు నిషేధం ఎత్తివే యాలని సిఫారసు చేస్తూ అధికారులు సిద్ధం చేసిన ఫైలు సీఎం కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయిలో కారుణ్య నియామకాలు, పదోన్నతులు చేపట్టవద్దని గత మే నెలలో ప్రభుత్వం జీవో 2147ను జారీ చేసింది. అయితే అంతకు ముందు నుంచీ కారుణ్య నియామకాలు, పదోన్నతుల కోసం తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు నిషేధం సడలించాలని ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకాలతో పాటు పదోన్నతులపైనా నిషేధాన్ని సడలించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇక డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ప్యానల్ గడువు సెప్టెంబర్‌తో ముగిసిపోనుండడంతో... అక్టోబర్ వరకు గడువు పొడిగించాలని గురువారం టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ ఫైలు సీఎం పరిశీలనలో ఉందని, త్వరలోనే ఆమోదం లభించనుందని వారు పేర్కొనట్లు దేవీప్రసాద్ చెప్పారు.