ప్లాస్టిక్ నిషేధం.. ప్రహసనం | Ban the use of plastic | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ నిషేధం.. ప్రహసనం

Published Thu, Aug 11 2016 11:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ప్లాస్టిక్ నిషేధం.. ప్రహసనం - Sakshi

ప్లాస్టిక్ నిషేధం.. ప్రహసనం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై అధికారులు చర్యలకు ఉపక్రమించా రు. నాలుగేళ్ల క్రితం పూర్తిగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రకటించి.. అనంతరం 40 మైక్రాన్ల లోపు పరిమితికి దిగివచ్చి.. నెల రోజుల్లోనే అమలును మరిచారు. ప్రస్తుతం 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ను నిషేధిస్తామంటున్నారు. గతంలో ప్రజల్లో అవగాహన పెరిగి, నిషేధం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే తరుణంలో ఓ లాబీకి తలొగ్గి, అప్పట్లో జీహెచ్‌ఎంసీలోని కొందరు పెద్దలు కుదుర్చుకున్న బేరంతో పథకాన్ని నీరు గార్చారు. ఇప్పుడు మళ్లీ ప్లాస్టిక్‌ నిషేధం అంటే ప్రజలు నమ్ముతారంటే భ్రమేనంటున్నారు కొందరు మేధావులు.

అప్పట్లో 40 మైక్రాన్ల లోపు కవర్లపై నిషేధాన్ని ప్రకటించడం వల్ల ప్రయోజనం చేకూరకపోగా.. అప్పటిదాకా ఉచితంగా అందిచ్చిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులకు ధర చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతి దుకాణంలోను ప్లాస్టిక్‌ సంచి కావాలంటే సరుకులతో పాటు అదనంగా ధర చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు, పాలకమండలి ఈ మేరకు ప్రజలకు తగిన అవగాహన కల్పించనే లేదు.

ప్లాస్టిక్‌ స్థానే ప్రత్యామ్నాయ జ్యూట్‌ బ్యాగులు వంటివి అందుబాటులోకి తేనేలేదు. ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులతో మాత్రం ఒకసారి సమావేశం నిర్వహించి, నిషేధాన్ని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దాదాపు పది రోజులు గడిచినా బ్యాగుల నిషేధం సరిగ్గా అమలు కాకపోవడంతో గురువారం నుంచి ఆకస్మిక జరిమానాలకు దిగారు. ఈ సారైనా పథకం పకడ్బందీగా అమలవుతుందా అంటే అనుమానమే. గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై గత అనుభవాలు, ప్రస్తుత తీరుపై ‘సాక్షి’ ఫోకస్‌..

చట్టం ఏం చెబుతుందంటే..
► కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు, హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రేటర్‌లో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై నిషేధం ప్రకటించారు.
► పర్యావరణ పరిరక్షణ చట్టం (1986), కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏ వ్యక్తీ రీ–సైకిల్డ్‌ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడరాదు. ఆహార పదార్థాలు తీసుకువెళ్లేందుకు గానీ, నిల్వ చేయడనికి గానీ వీటిని వినియోగించకూడదు.
►  50 మైక్రాన్ల మందం కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ, విక్రయం, నిల్వ చేయడం, పంపిణీ వంటివి పూర్తిగా నిషిద్ధం.
►  వ్యాపారులు ప్లాస్టిక్‌ బ్యాగుల్ని వినియోగదారులకు ఉచితంగా ఇవ్వరాదు. 50 మైక్రాన్లు, అంతకన్నా ఎక్కువ మందం కలిగిన వాటిని కనీసం రూ.2కు తక్కువగా విక్రయించరాదు. చిన్న క్యారీ బ్యాగుల్ని రూ.2కు, పెద్దవి రూ.5కు విక్రయించాలి.

 గత హెచ్చరికలు ఇలా..
♦ ప్రభుత్వ ఉత్వర్వులను ఉల్లంఘించే వ్యాపార సంస్థలు సీజ్‌.
♦ ప్లాస్టిక్‌ వినియోగించే దుకాణాలు, సంస్థల్ని తొలిసారి గుర్తిసే రూ.10 వేల జరిమానా, రెండోసారి రూ.25 వేలు జరిమానా విధిస్తారు. మూడో సారి కూడా దొరికితే సంస్థను మూసివేయడం లేదా జప్తు.
♦ సీజ్‌ చేసిన సంస్థలు తిరిగి తెరవాలంటే, ట్రేడ్‌ లైసెన్సు ఫీజు కన్నా పది రెట్లు జరిమానా.
♦ వ్యాపార సంస్థలు తాము ప్లాస్టిక్‌ బ్యాగుల్ని వినియోగించబోమని డిక్లరేషన్‌ ఇవ్వాలి. డిక్లరేషన్‌ను ఉల్లంఘిస్తే, సంస్థ మూసివేతతో పాటు జీహెచ్‌ఎంసీ తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధం కావాలి.
♦ ఎన్ని మైక్రాన్లతో తయారు చేశారో వివరాలు తెలిసేలా ఉత్పత్తిదారులు క్యారీ బ్యాగులపై తమ పేరు, చిరునామా, పీసీబీ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ నెంబరు, రీ సైక్లింగ్‌కు సంబంధించిన లోగో వంటివి తప్పనిసరిగా ముద్రించాలి. లేకుంటే చర్యలు తప్పదు.

 చివరికి పెనాల్టీలు..
సిటీలో ఈనెల ఒకటి నుంచి 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దుకాణాలు వినియోగిస్తూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు సైతం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకోవడంతో కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తనకు ప్రతిరోజూ చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. దీంతో గురువారం ఒక్కరోజే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు ఇస్తున్న వ్యాపారులకు రూ.1.53 లక్షల జరిమానాలు విధించారు. అంతకుముందు పదిరోజుల్లో రూ. 7.98 లక్షల జరిమానాలు వసూలు చేశారు. వెరసి మొత్తం 9.51 లక్షలు జరిమానాగా వసూలు చేశారు.

చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌..
నగరంలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్లను చీఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్లుగా నియమించారు. ఏఎంఓహెచ్‌లను అడిషనల్‌ చీఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్లుగా, ఏఎల్‌ఓలు, ఎల్‌ఐఎస్, ఎల్‌ఎస్‌ఐ, శానిటరీ సూపర్‌వైజర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులుగా నియమించారు. వీరు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలి. కానీ నగరంలో ఆదిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

 ఇలా చేయాల్సింది..
ప్టాస్టిక్‌ బ్యాగుల నిషేధానికి ముందస్తుగానే ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్‌ స్థానే కాగితం, క్లాత్, జనపనార సంచులు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకుగాను సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు, ఇతర మహిళా సంఘాలకు తగిన శిక్షణ నివ్వాలి. కానీ ఇప్పటి దాకా ఆ దిశగా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

నిషేధం అమలు చేస్తాం..
పర్యావరణానికి హానికరమైన 50మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. ఇప్పటికే ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించి సమస్యను వివరించాం. ఆగస్టు ఒకటి నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించాం. దీన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తాం. నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తప్పవు.
    – జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement