సమన్వయలోపం వల్లే భూకుంభకోణం: దత్తాత్రేయ
హైదరాబాద్ : మియాపూర్ భూకుంభకోణంపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. మియాపూర్లో 696 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురికావటం బాధాకరమైన విషయమని, రెవిన్యూ , రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల విచ్చలవిడిగా భూకుంభకోణం ఆయన అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ..హెచ్ఎండీఏ, ప్రభుత్వ భూమిని బాహాటంగా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చెయ్యటం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీల విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలు పాటించనందువల్లే ప్రభుత్వానికి రూ.600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు.
భూకుంభకోణంపై వేసిన కమిటీ చేసిన ఆడిట్ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వివరాలు ప్రభుత్వం ఆన్‌లైన్ లో అందరికి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ల విషయంలో టెక్నాలజీని ఉపయోగించి పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. భూ భారతి స్కీం (ఎలక్ట్రానిక్ ల్యాండ్ రికార్డింగ్ సిస్టం) సంపూర్ణంగా అమలు చెయ్యాలన్నారు. మా భూమి పోర్టల్ కు ప్రచారం కల్పించాలని సూచించారు. వెంటనే భూ చట్టాలకు సవరణలను తీసుకొని రావాలని అభిప్రాయపడ్డారు. భూ కుంభకోణంలో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.