
మిర్చి సాగుచేయమన్నది మీరేగా..
- ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి మీరే కొనండి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: మిర్చి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయమని గత ఏడాది రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ మంత్రులు ప్రోత్సహించడంతోనే వారు ఎక్కువ మొత్తంలో సాగు చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దీంతో పంటకు మద్దతు ధర లభించడం లేదని పేర్కొన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంపై సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌తో చర్చించిన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతు ధర నిర్ణయించలేదని, అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేంద్రం కల్పించుకొని రూ.5 వేలు ధర, రూ.1,250 ఓవర్‌హెడ్ చార్జీలు ప్రకటించిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అనంతరం రైతులను ఆదుకోవడానికి కేంద్రం తనవంతు సాయం చేస్తుందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్ల శాతాన్ని 30 నుంచి 42 శాతానికి పెంచిందన్నారు. పెంచిన 12 శాతంలోంచి మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని ఆయన కోరారు.
అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌కు రూ. 254 కోట్లు
కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సమావేశమైన దత్తాత్రేయ తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. ఈ ఏడాదికి రాష్ట్రానికి 31 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు గడ్కరీ చెప్పినట్టు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.254 కోట్లు మంజూరు చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. అలాగే ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.950 కోట్లు మంజూరు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు.