రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ
అన్నదాతల ఆత్మహత్యల వివరాలిస్తే కేంద్రాన్ని ఎక్స్‌గ్రేషియా కోరతా
నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి పంటనష్టాన్ని వివరిస్తాం
పంట నష్టంపై కేంద్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శితో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా వాటిల్లిన పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక అందితే దాన్ని బట్టి కేంద్రాన్ని పరిహారం కోరవచ్చని, వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం వివరాలు అందజేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి అకాల వర్షాల నష్టాన్ని వివరిస్తానన్నారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద గతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.205 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని, ఆ నిధులు నష్టపోయిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల వాటిల్లిన పంటల నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌తో కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. కేంద్రంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయం సహాయక సంఘాల ద్వారా తడిసిన ధాన్యం సేకరించాలని సూచించారు.
2012-13 ఏడాదికి గానూ ఉద్యానవన పంటల ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 33 కోట్లను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించకపోవడాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 418 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అంచనా వేస్తున్నా.. ప్రభుత్వం కేవలం 96 సంఖ్య చూపుతోందన్నారు. సరైన వివరాలు అందజేస్తే కేంద్రం నుంచి ఎక్స్‌గ్రేషియా అందజేసే ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు జి. కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, పి. సుగుణాకర్‌రావు పాల్గొన్నారు.
సమగ్ర పంట నష్టం వివరాలివ్వండి
Published Mon, Apr 27 2015 2:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement