లక్షల ఎకరాల్లో వరి ఎండుతోంది: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోతోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలపై దత్తాత్రేయ శనివారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతేడాది మిరప క్వింటాలుకు రూ.14 వేలు ధర పలికితే, ఇప్పుడు కేవలం రూ.4 వేలకే రైతు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. మిరపను రూ.7–8 వేలకు కొనుగోలు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి చర్చిస్తానన్నారు. అలాగే, మిరప రైతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు.
పంట రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య సయోధ్య లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ. 4 వేల కోట్లు కోరిందని, ఇది కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు దత్తాత్రేయ తెలిపారు. 10 కోల్డ్‌స్టోరేజీలు మంజూరుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరినట్లు ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలోని రూ.180 కోట్ల పుర ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.