విద్యార్థుల కోసం బంధుమిత్రుల ఆరా
- వీఎన్‌ఆర్-వీజేఐటీ వద్ద ఉద్విగ్న వాతావరణం
- షాక్‌కు గురైన యాజమాన్యం
- హిమాచల్‌ప్రదేశ్‌కు తరలివెళ్లిన తల్లిదండ్రులు
- విద్యార్థుల కోసం బంధుమిత్రుల ఆరా
జగద్గిరిగుట్ట : హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీ హైడ్రో పవర్ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో.. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలి వచ్చారు. వారి రోదనలతో ఈ ప్రాంతం అంతా ఉద్విగ్నంగా మారింది.
ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుసుకుని విద్యార్థులు, కళాశాల సిబ్బంది హతాశులయ్యారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది. కుత్బుల్లాపూర్ మండల ఆర్‌ఐ ప్రభుదాసు కాలేజీని సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బందితో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించారు. బాచుపల్లిలోని కాలేజీలో నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు.
హిమాచల్‌ప్రదేశ్‌కు తల్లిదండ్రులు
తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్‌ప్రదేశ్‌కు విమానంలో రెండు విడతలుగా తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి.డి.నాయుడు ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు బయలుదేరి వె ళ్లారు. కొంతమంది దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు బాచుపల్లిలోని కాలేజీ చేరుకుని సమాచారం కోసం విశ్వప్రయత్నం చేశారు. తమ పిల్లల వివరాలను వెల్లడించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం యాజమాన్యం నుంచి సరైన స్పందన లేదని రాంబాబు అనే విద్యార్థి తండ్రి శేఖర్ నాయక్ కాలేజీ భవ నం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా చేరుకున్న వారిని మరో విమానంలో హిమాచల్‌ప్రదేశ్‌కు పంపింది.
కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు
నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులు కొంతమంది మృతి చెందడంతో కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలానగర్ ఏసీపీ నాగరాజరెడ్డి నేతృత్వంలో దుండిగల్ పోలీసులతో పాటు బీఎస్‌ఎఫ్ దళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు ఘటనా స్థలానికి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.
కళ్లు తిరిగి పడిపోయిన సీఏఓ
విద్యార్థులు గల్లంతై మృతి చెందిన విషయం తెలుసుకున్న కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి (సీఏఓ) సి.వి.రావు షాక్‌కు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది హడావుడి కనిపించింది. హుటాహుటిన డాక్టర్‌ను పిలిపించి పరిస్థితిని అదుపు చేశారు.
దురదృష్టకరం : సీఏఓ సీవీ రావు
వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థులు నదిలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని, విద్యార్థుల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని అందుకు తాము ఎంతో బాధపడుతున్నామని కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సీవీ రావు అన్నారు. బాచుపల్లిలోని కళాశాలలో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం తమకు సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సమాచారం అందించమన్నారు. సిగ్నల్స్ అందకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమకు ప్రభుత్వపరంగా ఎంతో సహాయం అందించారని ఆయన తెలిపారు. తమకు ప్రత్యేక విమానాలను సమకూర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. తమ విద్యార్థులను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నమన్నారు. ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.
విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతాం
నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలాలకు ఎయిర్ పోర్ట్ నుంచి చేరవేస్తామని సీవీ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు లభించిన మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు.
షాక్‌కు గురయ్యాం
ఆదివారం ఇండస్ట్రీయ్‌ల్ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. టూర్‌కు వెళ్లిన ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులంతా సత్ప్రవర్తన కలిగిన పిల్లలే. ఇంత ఘోరం వీరికే జరగడం బాధాకరం. మృతి చెందిన వారిలో ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులున్నారు. ఈ షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేక పోతున్నాం.
- కె.అనిత, ఈఐఈ బ్రాంచ్ ఫ్యాకల్టీ
గుండె బరువెక్కుతోంది
భగవంతుడు మా విద్యార్థులకే ఇలాంటి కష్టాలు తేవాలా? ఎంతో మంచి తెలివితేటలు కలిగిన విద్యార్థులు లేరన్న సంగతి తల్చుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివి జీవితంలో స్థిరపడే సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. మాకే ఇంత బాధ ఉంటే ఇక విద్యార్థులను కనిపెంచిన వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో?
- కిరణ్మయి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్