మూడు చోట్ల.. | Three places .. | Sakshi
Sakshi News home page

మూడు చోట్ల..

Published Tue, Jun 10 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

మూడు చోట్ల..

మూడు చోట్ల..

సాక్షి, సిటీబ్యూరో: హిమాచల్‌ప్రదేశ్ లార్జీ డ్యామ్ దుర్ఘటన నేపథ్యంలో నగరంలో మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐశ్వర్య, విజేత, రాంబాబు, లక్ష్మీగాయత్రిల పార్థివ దేహాలు బేగంపేట్ విమానాశ్రయానికి వస్తాయని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

వారి రోదనలతో ఈ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వారి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఇక ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని విద్యార్థులు చదువుతున్న వీఎన్‌ఆర్- వీజేఐటీ కళాశాలకు సైతం విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు అధిక సంఖ్యలో బాచుపల్లిలోని కళాశాల ఆవరణకు చేరుకోవడంతో ఇక్కడి పరిస్థితులు గంభీరంగా మారాయి.

అలాగే త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్న మరో 24 మంది విద్యార్థులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వస్తున్నారన్న సమాచారంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడు ప్రత్యేక విమానాలు నగరానికి చేరుకుంటాయోనన్న ఆదుర్దాతో గడిపారు.    
 
శంషాబాద్ విమానాశ్రయం వద్ద..
 
గల్లంతయిన విద్యార్థుల జాడ తెలుసుకునేందుకు సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 15 మంది ప్రముఖులు, అధికారులు హిమాచల్‌ప్రదేశ్‌కు తరలి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో సుమారు 21 మంది హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు.

ఇక ప్రమాదం నుంచి బయటపడిన 24 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగి వస్తారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడంతో ఇక్కడ ఉద్విగ్నత చోటుచేసుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విమానాశ్రయ పరిసరాల్లో బాధిత కుటుంబ సభ్యుల రాకపోకలు, మీడియా పోలీసుల హడావుడి నెలకొంది.  
 
వీఎన్‌ఆర్-వీజేఐటీ వద్ద..
 
స్టడీటూర్‌కు వెళ్లిన విద్యార్థులు బీయాస్ నదిలో గల్లంతయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లితండ్రులతో పాటు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గల్లంతైన విద్యార్థుల క్షేమ సమాచారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులు పెద్దసంఖ్యలో కళాశాలకు తరలి వచ్చారు. ఏకకాలంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారన్న షాక్ నుంచి పలువురు తేరుకోలేకపోయారు. పోలీసు అధికారులు, మీడియా హడావుడితో ఈ ప్రాంతం కిటకిటలాడింది.
 
బేగంపేట విమానాశ్రయం వద్ద..

 
లార్జీ దుర్ఘటనలో మృత్యువాత పడిన ఐశ్వర్య, విజేత, రాంబాబు, లక్ష్మీగాయత్రిల పార్థివ దేహాలు బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నాయన్న సమాచారం తెలుసుకొని సోమవారం రాత్రి వారి తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో బేగంపేట విమానాశ్రాయనికి చేరుకున్నారు. బంగరు భవిష్యత్ ఉన్న తమ పిల్లలు విగత జీవులుగా మారారన్న సమాచారం వారిని శోకసంద్రంలో ముంచింది. వారి రోదనలు మిన్నంటడడంతో ఇక్కడ ఉద్విగ్నత నెలకొంది. మృతదేహాలు ఎప్పుడు నగరానికి చేరుకుంటాయోనని వారి బంధువులు అక్కడున్న పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బందిని సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరా తీస్తూ ఉండటం కనిపించింది.
 
 అలర్ట్ చేయలేదు
 డ్యామ్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ మమ్మల్ని ఎవరూ అలర్ట్ చేయలేదు. దీంతో మా ఫ్రెండ్స్ నదిని చూడడానికి కిందికి దిగారు. అడుగు భాగంలో ఉన్న నీళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మా కళ్లముందే అంతా జరిగింది. ఇంకా భయం పోవడం లేదు.    
 - సాయిలావణ్య, కేపీహెచ్‌బీ
 
 ఆనందంతో పాటు బాధగా ఉంది
 మా అబ్బాయి సుహర్ష సురక్షితంగా రావడంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ మిగతా పిల్లలు గల్లంతు కావడంతో చాలా బాధగా ఉంది. మా వాడు సంఘటన జరిగినప్పటి నుంచి మాకు ఫోన్‌లో పరిస్థితిని వివరిస్తూనే ఉన్నాడు. వాడు చాలా షాక్‌లో ఉన్నాడు.  
 - చలపతిరావు, సుహర్ష తండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement