సాక్షి, సిద్దిపేట : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్వామి పరిపూర్ణానందలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ... బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరిచి పోలేనిదని, అక్కడి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. వారి త్యాగాలను, ఆశయాలను వృధా పోనివ్వకుండా చూస్తామని తెలిపారు. అప్పటి నిజాం సేనలు బైరాన్‌పల్లిలో వందలమందిని కాల్చి చంపితే ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గు లేకుండా నిజాంను పొగుడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాల సాధన కోసం బీజేపీ ఎప్పటికి పాటు పడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో కాషాయజెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉందని స్వామి పరిపూర్ణానంద వెల్లడించారు. ఒకేరోజులో 118మంది బైరాన్‌పల్లి వాసులను నిజాం రజాకార్లు బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నేను యదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానంటే తనను రాష్ట్రం నుంచి బహిష్కరించిన కేసీఆర్‌ను సంవత్సరం తిరగకముందే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యమంత్రి బొమ్మలను బహిష్కరించారని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment