బ్యాంకర్లా..మజాకా!
బ్యాంకర్లా..మజాకా!
Published Wed, Feb 24 2016 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
సంఘంలో లేరు.. రుణం తీసుకోలేదు..
అయినా డబ్బులు చెల్లించాలని వృద్ధురాలికి నోటీసులు
వనపర్తి : చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం మంజూరు చేయని బ్యాంకు అధికారులు సంఘంలో లేకున్నా, అడక్కుండానే రుణం ఇచ్చినట్టు, కొన్నేళ్లుగా కట్టనట్టు ఓ అమాయక వృద్ధురాలికి నోటీసులు జారీచేశారు. ఇంతకు రుణాలు ఎవరు తీసుకుంటున్నారో, సంఘంలో ఉన్నవారు నిజంగా ఉన్నారా లేరా.. అనే విషయాలు తెలుసుకోకుండానే రూ.3.50లక్షల లోన్ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. పూర్తి వివరాలిలా..
వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలోని నందీశ్వర మహిళా సంఘానికి అదే గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు గతేడాది మార్చి 17న రూ.3.50లక్షల రుణం ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం మూడునెలల కిస్తులు కూడా చెల్లించలేదని డీఫాల్ట్ సంఘంగా బ్యాంకర్లు గుర్తించి అగ్రిమెంటు ప్రకారం సంఘంలోని 12 మంది సభ్యులపై చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు. అయితే రుణం తీసుకున్న సంఘానికి సంబంధంలేని రామకిష్టమ్మ అనే వృద్ధురాలికి కూడా నోటీసు అందింది. ఆమె పేరును సంఘం సభ్యురాలిగా నమోదు చేయించి వేలిముద్రలు కూడా వేయించారు. వృద్ధురాలి కుమారుడు సత్యనారాయణ బ్యాంకుకు వెళ్లి వాకపు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకర్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు, బుక్‌కీపర్‌లు చెప్పే మాటలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.
తప్పుల తడకగా అగ్రిమెంటు
నందీశ్వర మహిళా సం ఘానికి ఇచ్చిన రూ. 3.50 లక్షల లోన్ అగ్రిమెంటులో అన్నీ తప్పులే ఉన్నాయి. ఒక చోట కార్యదర్శి వరలక్ష్మిగా, మరోచోట చంద్రకళ గా రాసి ఉంది. సభ్యులకు సంతకాలు చేయాల్సిన చోట అందరివీ వేలిముద్రలు వేసి ఉన్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ సంఘం సభ్యులను బ్యాంకు రప్పించుకుని ఒక్కొక్కరితో మాట్లా డి సంతకాలుచేసి అడ్రస్ కోసం ఆధార్ గాని రేషన్ కార్డు గాని జిరాక్స్ కాపిలను తీసుకోవాల్సి ఉంది. కాని అగ్రిమెంటులో సభ్యులకు సంబంధించిన వివరాలు పేర్లు తప్పా మరేమి లేకపోవటం గమనార్హం. ఇదిలావుండగా సంఘం సభ్యుల జాబితాలో పేరు ఉండటంతోనే వృద్ధురాలికి నోటీసులిచ్చామని కడుకుంట్ల ఏపీజీవీబీ ఇన్‌చార్జ్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. సంఘం గ్రూప్ ఫొటో తీసుకురావాలని చాలా సార్లు కోరినా అద్యక్ష కార్యదర్శులు స్పందించలేదని తెలిపారు.
నేను ఎవరికి బాకీలేను సార్
నేను పుట్టినప్పటి నుంచి ఏనాడు సంఘంలో చేరలేదు. ఒక్కనాడూ బ్యాంకునకు పోలేదు. జీవితంలో ఎవరికీ బాకీపడలేదు. అలాంటి నాకు బ్యాంకులో బాకీ ఉందని చెప్పి టప్పలో ఓ కాగితం పంపిండ్రు. పైసలు కట్టకపోతే జైల్లో వేస్తమని చెబుతున్నరు. నా పేరు ఎవరు రాసిండ్రో వారిని వేయండి జైల్లో
- రామకిష్టమ్మ, వృద్ధురాలు
Advertisement
Advertisement