
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తే బాగుంటుందని బ్యాంకర్లు, అధికారులు భావిస్తున్నారు. రైతులకు చెక్కులిస్తే సమస్యలు ఏర్పడతాయన్నారు. మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో కాకుండా, చెక్కుల రూపంలో ఇవ్వాలని యోచిస్తున్నట్లు సీఎం ఇటీవల శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు బ్యాంకర్లలోనూ చర్చకు దారితీసింది. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) భేటీలో చర్చకు వచ్చినట్లు తెలి సింది. రుణమాఫీకి బడ్జెట్‌లో ఈ ఏడాది కి రూ.6 వేల కోట్లు కేటాయించారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసింది. దీంతో చాలాచోట్ల బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ సొమ్మును వసూలు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని చెక్కులు ఇవ్వాలన్న భావనలో ఉంది.
ఎన్నికల కోడ్ వస్తే: 2018 ఎన్నికల హామీలో భాగంగా గత డిసెంబర్ 11వ తేదీని గడువుగా లెక్కించి రైతులకు లక్ష రూపాయలలోపు రుణా న్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ.28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రుణ మాఫీ చేయాలనుకున్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉంటుంది. బడ్జెట్లో నిధులు కేటాయించినందున కోడ్ ప్రభావం ఉండదని అధికారులు అంటున్నారు. అయితే చెక్కులను పంపిణీ చేయడానికి ఈసీ అంగీకరించదని అంటున్నారు.
అవసరాలకు ఖర్చు పెట్టుకుంటారేమో!
బ్యాంకర్లు కొందరు రైతులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రుణాన్ని చెక్కుల రూపంలో ఇస్తే తప్పనిసరిగా బకాయి చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొందరు రైతులకు ఇతరత్రా అవసరాలు, అప్పులు ఉండొచ్చు. ఈ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కాబట్టి రైతుకు చెక్కులివ్వడం కంటే బ్యాంకులకు చెల్లిస్తేనే ప్రయోజనమని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment