అప్‌లాంజ్‌ బార్‌ సీజ్‌  | Bar Was Seized For Selling Liquor To Minor In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 25 2018 1:44 AM | Last Updated on Wed, Apr 25 2018 1:44 AM

Bar Was Seized For Selling Liquor To Minor In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం మత్తులో నిండు ప్రాణం బలిగొన్న యువతుల ఘటనపై ఘట్‌కేసర్‌ అధికారులు స్పందించారు. 21 ఏళ్ల వయసు లోపు వారికి మద్యం అమ్మకూడదన్న నిబంధనను పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు చేశారన్న కారణంతో మంగళవారం ఏఎస్‌రావు నగర్‌లోని అప్‌లాంజ్‌ (సమ్మక్క సారక్క) బార్‌ను ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రదీప్‌రావు, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య ఆధ్వర్యంలో దాడులు జరిపి సీజ్‌ చేశారు. నిర్వాహకుడు శ్రీధర్‌గౌడ్‌పై కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచన మేరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

సమ్మక్క–సారక్క పేరుతో నాగారానికి చెందిన శ్రీధర్‌గౌడ్‌ పేరు మీద బార్‌కు లైసెన్స్‌ ఉంది. నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో నిర్వాహకుడు బార్‌ను మూసేశాడు. మూసేసిన బార్‌ను పై ఫ్లోర్‌లో ఉన్న అప్‌లాంజ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు లీజ్‌కు తీసుకొని గత 6 నెలలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కనీస నిబంధనలను పాటించకుండా బార్‌ నిర్వహణ, మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ బార్‌లో తప్పతాగిన యువతులు డ్రైవింగ్‌ చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు.  కాగా సదరు యువతులు 21 ఏళ్లు దాటినట్లు తప్పుడు ధృవపత్రాలు చూపించారని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అతిగా మద్యం సేవించడంతో బారు సిబ్బంది వారిని కారు వరకు తీసుకెళ్లి వదిలినట్లు సీసీ కెమెరా రికార్డులు చెబుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement