మద్యం బాటిళ్లకు బార్‌కోడ్ | barcode on alcohol bottles | Sakshi
Sakshi News home page

మద్యం బాటిళ్లకు బార్‌కోడ్

Published Thu, Jul 24 2014 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM

barcode on alcohol bottles

వైరా:  ఇక నుంచి మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయి. దుకాణ యజమానులు నాన్ డ్యూటీ పెయిడ్(ఎన్‌డీపీ) మద్యం అమ్మకాలు జరపకుండా చూసేందుకు కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను ఎక్సైజ్ శాఖ అమలు చేయనుంది. బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్‌ను కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే..  దాని (బాటిల్) ధర, ఎక్కడ తయారైంది తదితర వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ విధానాన్ని వైన్ షాపు యజమానులు వ్యతిరేకిస్తున్నారు.

 సాఫ్ట్‌వేర్ సిద్ధం
 ప్రస్తుతం మద్యం బాటిళ్ళపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్‌కోడ్ ఉంది. ఇకపై హోల్‌గ్రామ్ 2డీ బార్‌కోడ్ ఉంటుంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే స్టాఫ్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. డిస్టీలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు, వైన్ షాపులను అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టింది.

 అధిక ధరకు అడ్డుకట్ట
 మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌ను స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టీలరీ, డిస్టీలరీ నుంచి డిపో, డిపో నుంచి మద్యం దుకాణం, ఏ రకం బ్రాండ్, దాని ధర తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీకంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. వైన్ షాపు యజమానులు గతంలో ఎమ్మార్పీకన్నా 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తుండేవారు. బార్‌కోడ్ విధానంతో దీనికి అడ్డుకట్ట పడుతుంది.

 మద్యం యజమానులకు సౌలభ్యం..
 జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విసృ్తతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్‌కోడ్ అమల్లోకి వస్తే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కు కూడా చెక్ పడే అవకాశాలున్నాయి. బార్ కోడ్ విధానం వైన్ షాపు యజమానులకు లాభకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వైన్ షాపు యజమాని కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌ఫోన్‌కు అనుసంధానమైతే అమ్మకాలపై సంక్షిప్త సమాచారం వస్తుంది.

 సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్‌లైన్‌లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రతి రోజు అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. దుకాణంలో ఎన్ని బాటిళ్ళు అమ్ముడుపోయాయి.. ఏయే బాటిళ్ళు విక్రయాలు జరుగుతున్నాయనే వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు.

 అయినా అసంతృప్తే..
 బార్‌కోడ్ విధానంపై గత వారం మద్యం దుకాణాలను ప్రారంభించిన వైన్‌షాపు యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాటిల్‌ను స్కానింగ్ చేయాలంటే ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే 50 వేల నుంచి 80వేల వరకు ఖర్చవుతుంది. దీనిని ఆపరేట్ చేసేందుకు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలి. ఇదంతా తమకు భారమవుతుందని వారు అంటున్నారు. మద్యం వ్యాపారంలోకి కొత్తగా వచ్చిన వారు.. ఈ బార్‌కోడ్ విధానాన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు.

 అధికారులకు ఆండ్రాయిడ్ ఫోన్లు
 తనిఖీల కోసం వెళ్ళే అధికారులకు స్కానింగ్ అప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కానింగ్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్‌లో వస్తాయని, తద్వారా అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరా, డ్యూటీ పెయిడ్ లిక్కరా అనేది తెలుస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement