భాషా పండిట్‌లు, పీఈటీలు ఇక స్కూల్‌ అసిస్టెంట్లు..! | Basha Pandits And PETs Are Now School Assistants | Sakshi
Sakshi News home page

భాషా పండిట్‌లు, పీఈటీలు ఇక స్కూల్‌ అసిస్టెంట్లు..!

Published Mon, Feb 18 2019 1:01 PM | Last Updated on Mon, Feb 18 2019 1:01 PM

Basha Pandits And PETs Are Now School Assistants - Sakshi

భువనగిరి : తమ ఉద్యోగాలను అప్‌గ్రేడ్‌ చేయాలని తెలుగు, హిందీ భాషా పండిట్‌లతో పాటు పీఈటీలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతున్న గండమల్ల విశ్వరూపం ఎల్‌బీ స్టేడియంలో 2017 డిసెంబర్‌లో జరిగిన తెలుగు భాషా ప్రపంచ మహాసభల సందర్భంగా భాషా పండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భాషా పండితులకు పాతికేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో గ్రేడ్‌–2  పండితుల స్థాయిలోనే పదవీ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 270 మందికి లబ్ధి చేకూరనుంది.

పాతికేళ్లుగా తక్కువ వేతనంతోనే విధులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,446 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఎస్జీటీలు అందరూ ప్రాథమిక పాఠశాలల్లో,  స్కూల్‌ అసిస్టెంట్లు హైస్కూళ్లలో విద్యాబోధన చేస్తున్నారు. ఎస్జీటీ కేటగిరీలో ఎంపికైన భాషా పండితులు, పీఈటీలు మాత్రం హైస్కూళ్లలో పని చేస్తుంటారు. వీరు ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లతో సమానంగా పని చేస్తున్నప్పటికీ ఎస్జీటీల జీతభత్యాలు మాత్రమే లభిస్తున్నాయి. రైట్‌ టు యాక్ట్‌ ప్రకారం పనికి తగిన వేతనం చెల్లించాలని పాతికేళ్లుగా భాషా పండితులు, పీఈటీలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అప్‌గ్రేడ్‌ చేయాలంటూ 2002లో  ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం స్పందించి 2017 ఫిబ్రవరి 3వ తేదీన 17, 18జీఓలను తీసుకువచ్చి పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఆ జీఓలపై ఇతర ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో దశాబ్ధన్నర కాలంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.

273 మందికి అప్‌గ్రేడ్‌
జిల్లాలో 63 ప్రాథమికోన్నత, 466 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,446మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 1,095పని చేస్తుండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 351మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.   కాగా ప్రభుత్వం భాషా పండితులకు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయనుండటంతో జిల్లాలోని 273 మందికి పదోన్నతి లభించనుంది. జిల్లాలో 120మంది తెలుగు, 73 హిందీ భాషా పండితులు, 80మంది పీఈటీలు ఉన్నారు. వీరిందరినీ అప్‌గ్రేడ్‌ చేయడంతో స్కూల్‌అసిస్టెంట్లకు లభించే జీతభత్యాలతోపాటు పదోన్నతులు కూడా లభించనున్నాయి.

ఫలితం దక్కింది
దశాబ్ద కాలం పాటు భాషా పం డితులు చేసిన సుధీర్ఘపోరా టానికి ఫలితం దక్కింది. చాలా సంవత్సరాల నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ హోదాలో ఉన్నప్పటికీ వేతనాలు రాక, పండితులు ఇబ్బందులు పడ్డారు. భాషా పండితులు స్కూల్‌ అసిస్టెంట్లుగా మార్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
–కందుల ఉపేందర్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు

సంతోషంగా ఉంది
గ్రేడ్‌–2 హోదాలో ఉన్న భాషా పండితులకు పని ఎక్కువగా ఉండటంతోపాటు వేతనం తక్కువగా ఉండేది. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పని చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రేడ్‌2 హోదాలో ఉన్న పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా మార్చడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉంది.
–మహేశ్వరం విజయ, ఉత్తటూరు, రామన్నపేట మండలం

స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా దక్కనుంది
గ్రేడ్‌2 హోదాతో దశాబ్ధన్నర కా లం పాటు పాఠశాలలో పని చేశా.  గ్రేడ్‌2 హోదాలో ఉన్న త మకు ఎస్‌ఏ హోదా ఇవ్వాలని 1998 నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం. 2003లో రెండుసార్లు జీవోల ద్వారా పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన జరగలేదు. ప్రస్తుతం ఈవిషయంలో ప్రభుత్వం మార్పులు చేసి అప్‌గ్రేడ్‌ చేయడం పట్ల సంతోషంగా ఉంది.
–మర్రి జయశ్రీ, భాషా పండితురాలు, ఖప్రాయపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement