- బాసరలో ముగిసిన విజిలెన్స్ విచారణ
- ఆలయ రికార్డులను తీసుకెళ్లిన అధికారుల బృందం
- అధికారుల తనిఖీల్లో వెల్లడైన అక్రమాలు
- అవినీతిపరుల్లో ఆందోళన
భైంసా : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ విచారణ ముగిసింది. ఆలయంలో అవినీతి చోటు చేసుకుంటోందని పలుమార్లు విజిలెన్స్ అధికారులకు గతంలో ఫిర్యాదులు అందాయి. త్వరలోనే గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు చోటు చేసుకున్న అవినీతి నేపథ్యంలో ఈ బృందం విచారణ చేపట్టింది. దీంతో అవినీతిపరుల గుండెల్లో గుబులు మొదలైంది.
నివేదిక ఇవ్వాలని ఆదేశం..
ఇప్పటికే పుష్కరాల్లో ఎలాంటి అవినీతి జరగొద్దని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పుష్కరాలను పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది. ఇప్పటి వరకు ఆలయంలో చోటు చేసుకున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విజిలెన్స్ బృందాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగానే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం చేరుకుంది. మొదటి రోజు విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాలు నిర్వహించింది. శనివారం విజిలెన్స్ ఏఎస్పీ వెంకట్‌రెడ్డి బాసరకు చేరుకోగా.
సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక ఆలయ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ ఏఎస్పీ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ బాలస్వామి, విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్, సుధాకర్‌రావు, శశిధర్‌రెడ్డి, రాంచందర్‌రావు బృందం ఆలయ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆలయ స్టోర్, టికెట్టు విక్రయ కేంద్రాలు విచారణ కేంద్రంలో తనిఖీలు కొనసాగించారు. లడ్డూ, పులిహోర తయారీకి వినియోగిస్తున్న వస్తువుల నాణ్యతను దగ్గరుండి పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన వివరాలను ఈవో రమణమూర్తిని సమాచారం అడిగి తెలుసుకున్నారు.
కానుకలపై ఆరా..
అమ్మవారికి పెద్దమొత్తంలో వచ్చే కానుకలపైనా అధికారులు దృష్టి సారించారు. విజిలెన్స్ బృందం సభ్యులు అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో భక్తుల నుంచి పూజల కోసం సేకరిస్తున్న నిధులు, విరాళాలు, శాశ్వత పూజలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులపాటు అధికారుల బృందం అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టింది. గతంలో విజిలెన్స్ బృందానికి అందిన ఫిర్యాదులపైనా ఈ సమయంలోనే విచారణ చేపట్టారు. ఆలయ రికార్డులను పూర్తిస్థాయి విచారణ కోసం విజిలెన్స్ బృందం కరీంనగర్ తీసుకెళ్లారు.
అక్రమాలపై విచారణ..
చదువుల తల్లిగా పేరొందిన బాసర సరస్వతీ ఆలయంలో అక్రమాల తతంగం కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి తీరుతో నివ్వెరపోతున్నారు. నడక నేర్వగానే అక్షరాలు దిద్దించేందుకు అమ్మవారి చెంతకు వస్తున్న జనాలకు ఇక్కడి అక్రమాలు చూసి నివ్వెరపోవాల్సి వస్తోంది. ఆలయ హుండీ పక్కనే పూజారులు అక్రమ హుండీలతో వచ్చే కానుకలు నేరుగా తీసుకెళుతున్నా.
ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. కోట్ల రూపాయల విలువ చేసే ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో, దుకాణాల అద్దెలు వసూళ్లు చేయడంలోనూ సిబ్బంది తీవ్ర జాప్యం చేశారు. బకాయిలు పడ్డా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రోజూ వచ్చే భక్తులకు కేటాయించే అద్దె గదుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. గతంలో పనిచేసిన ఈవోలు, ఇన్‌చార్జి ఈవోలు ఈ అక్రమ తతంగంలో భాగస్వాములే.
బాసర ఆలయంలో పనిచేసే అధికారులు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెడుతున్నారు. విజిలెన్స్ అధికారుల విచారణ నేపథ్యంలో అవినీతి అధికారులు జంకుతున్నారు. విచారణ పూర్తి కాకముందే అధికారులంతా తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. భక్తులకు విక్రయించే లడ్డూలు, ఆలయ ప్రాంగణంలో ఇతర సామగ్రి ఇలా అన్ని విషయాల్లోనూ అధికారులు ఇక్కడికి వచ్చే వారిని నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని విచారణలో తేలినట్లు సమాచారం.
ముగిసిన విచారణ..
రెండు రోజులపాటు చేపట్టిన విచారణ ముగిసిందని విజిలెన్స్ ఏఎస్పీ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు రికార్డులను తీసుకెళ్తున్నామన్నారు. త్వరలోనే ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఆలయంలో ముందస్తు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
గుండెల్లో గుబులు
Published Sun, Apr 19 2015 2:18 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement