బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. | Bathukamma celebrations at collectorate | Sakshi
Sakshi News home page

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

Published Sun, Sep 28 2014 1:09 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM

Bathukamma celebrations at collectorate

కలెక్టరేట్‌లో ఘనంగా నానబియ్యం బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి అర్బన్: జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీ మహిళా కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ ఉద్యోగినులు, అందంగా పేర్చిన బతుకమ్మలతో సంగారెడ్డి కలెక్టరేట్ శోభాయమానంగా వెలిగిపోయింది. ఉద్యోగినులు బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాన్ని  3 గంటల పాటు ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నారు. తంగెడు, గుమ్మడి, కట్లపూలు, గునుగుపూలు, బంతి ఇలా తీరొక్కపూలను పళ్లెంలో గోపురంగా పేర్చి తమ కళాత్మకతను ప్రదర్శించారు. నాల్గవరోజు నాన బియ్యం బతుకమ్మగా పిలిచే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వ్యవసాయ శాఖ మహిళా ఉద్యోగులు , ఐసీడీఎస్ ఉద్యోగులు మధ్యాహ్నం నుంచే బతుకమ్మలను తయారుచేశారు. ఐసీడీఎస్, వ్యవసాయ శాఖ కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున రంగురంగుల ముగ్గులు వేశారు. బతుకమ్మలపై జై తెలంగాణతో పాటు తమ శాఖల పేర్లను ప్రదర్శించారు.
 
అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఏపీడీ ఉమారాణి , డీసీపీఓ రత్నం, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ జయరాం నాయక్ , ప్రవీణ్‌కుమార్, నిర్మల, పద్మలత, బాలచందర్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్యన ఊరేగింపుగా కలెక్టరేట్ వెలుపల ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద ఉంచారు. జిల్లా ఖజానా అధికారి ఉదయలక్ష్మి ఉత్సవాలను పర్యవేక్షించగా , వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్ తెలంగాణ తల్లికి పూలమాల వేసి బతుకమ్మ పండగను ప్రారంభించారు. మహిళా ఉద్యోగినులు వలయాకారంగా ఏర్పడి మనోహరమైన లయ నృత్యంతో ఆడిన బతుకమ్మ చూపరులకు ఆహ్లాదం కల్గించింది.
 
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో..
జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మగా పిలిచే ఉత్సవంలో భాగంగా బతుకమ్మ సంబురాలను ఆస్పత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో  జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్  టీఆర్‌ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, హరికిషన్ , రాంరెడ్డి,   శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement