బతుకమ్మ నిమజ్జనానికి భారీ భద్రత
- బందోబస్తులో 2 వేల మంది పోలీసులు
- భారీగా మహిళా వలంటీర్ల వినియోగం
సైఫాబాద్: సామూహిక బతుకమ్మ నిమజ్జనోత్సవం గురువారం హుస్సేన్‌సాగర్‌లో జరగనున్న నేపథ్యంలో మధ్య మండల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. బతుకమ్మను తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంతో గతానికి భిన్నంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పైగా ఇది మహిళల పండుగ కావడంతో నిమజ్జనంలో చైన్ స్నాచర్లు, ఇతర ప్రాపర్టీ అఫెండర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అనుమానించిన సెంట్రల్ జోన్ అధికారులు వారికి చెక్ చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఊరేగింపులు జరిగే ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు డేగ కంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 100 సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు వీడియో గ్రాఫర్లను సైతం నియమించి మొత్తం 200 వీడియో కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. బందోబస్తు కోసం రెండు వేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో దాదాపు 500 మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అనుమానితులను పట్టుకునేందుకు మరికొంత మంది సిబ్బందిని మఫ్టీలో ఉంటారు.
పోలీసులతో పాటు 400 మంది వలంటీర్లు, మరో 300 మంది ఎన్‌సీసీ క్యాడెట్లను సైతం ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై మోహరిస్తారు. నగరంలో రెచ్చిపోతున్న స్నాచర్లలో బయట జిల్లాల వారు కూడా ఉంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా జిల్లాల నుంచీ క్రైమ్ టీమ్స్‌ను రప్పిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ఉన్న నేరగాళ్ల అడ్డాలపై గురువారం వరకు వరుస దాడులు చేయాలని, అవసరమైన చోట కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.