సెప్టెంబర్‌ 15 నాటికి బతుకమ్మ చీరలు | Bathukamma Saree Distribution From September 15 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 15 నాటికి బతుకమ్మ చీరలు

Published Fri, Jun 14 2019 3:31 AM | Last Updated on Fri, Jun 14 2019 3:31 AM

Bathukamma Saree Distribution From September 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బతుకమ్మ చీరల పంపిణీలో గతంలో తలెత్తిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది చీరల తయారీని సెప్టెంబర్‌ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. 6.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగాల్సి ఉండటంతో.. ఫిబ్రవరిలోనే చేనేత సహకార సంఘాలకు చీరల తయారీకి చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆర్డర్‌ ఇచ్చింది. గతంతో పోలిస్తే రంగులు, డిజైన్ల ఎంపికలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగుల్లో 50 రకాలైన చీరలను ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 2017 నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రెండేళ్లుగా సుమారు 90లక్షల మందికి పైగా ఉచితంగా చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 95లక్షల చీరల పంపిణీని లక్ష్యంగా నిర్దేశించింది. చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు అప్పగించారు.

బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తొలి ఏడాది.. అనగా 2017లో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో.. సిరిసిల్ల చేనేత సహకార సంఘాలు సకాలంలో చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక పోయాయి. దీంతో 3.75కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాల మీద సిద్ధం చేయగా, మరో 2.36కోట్ల మీటర్ల వస్త్రాన్ని గుజరాత్‌లోని సూరత్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. సూరత్‌ నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రం నాణ్యతపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2018 బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన ఆర్డర్‌ను పూర్తిగా సిరిసిల్ల నేత కార్మికులే స్థానికంగా మరమగ్గాలపై సిద్ధం చేశారు. సుమారు 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సకాలంలో సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌ మూడో వారంలో ఈ చీరల పంపిణీ ప్రారంభించి..ఈ ఏడాది జనవరి వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. 

టెస్కో ద్వారా రూ.450 కోట్ల ఆర్డర్లు 
తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌ (టెస్కో) ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది సుమారు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. ఈ ఏడాది రూ.280 కోట్లు బతుకమ్మ చీరల రూపంలో సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్‌ లభించింది. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్‌ కూడా ఈ సంఘాలకే దక్కింది. కేసీఆర్‌ కిట్ల ద్వారా బాలింతలకు ఇచ్చే చీరలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించి దుప్పట్లు, కార్పెట్ల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఇదిలా ఉంటే బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్న సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. గత ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్‌ వస్త్రాల తయారీకి సంబంధించి టెస్కో నుంచి రూ.25 కోట్ల మేర ఈ సంఘాలకు విడుదల కావాల్సి ఉంది.  

95 లక్షల మందికి పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీకి రెండేళ్లుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ మూడో వారంలో లబ్ధిదారులకు చీరలు అందేలా చేనేత శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముదురు రంగులతో కూడిన 50 రకాలైన డిజైన్లను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ నిపుణులు రూపొందించారు. చీర అంచులు, కొంగు డిజైన్లలో వైవిధ్యం ఉండేలా రూపొందించడంతో పాటు, చీరతో పాటు రవిక బట్టను కూడా అందిస్తారు. ఈ ఏడాది సుమారు 6.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్‌ ఇవ్వగా.. 95లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు. వీటి తయారీ ద్వారా సిరిసిల్లలో 22వేలకు పైగా మరమగ్గాలపై ఆధారపడిన 20వేల మంది చేనేత కార్మికులకు సుమారు ఆరు నెలల పాటు ఉపాధి దక్కనుంది. గతంలో సగటున నెలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు వేతనం పొందిన కార్మికులు.. ప్రస్తుత ఆర్డర్లతో సుమారు రూ.20వేల వరకు ఆర్జిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement