సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా 95 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ చీరల తయారీ పూర్తయిందని, అక్టోబర్ 12 నుంచి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం చీరలను పరిశీలించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది జరిగిన చిన్న అసంతృప్తులను సవరించుకుని రూ.280 కోట్లతో వేగంగా చీరల తయారీ కొనసాగించామని తెలిపారు. గతేడాది సమయాభావం వల్ల కొన్ని చీరలను సూరత్ నుంచి తెప్పించామని, కానీ ఈసారి అలా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. 80 రకాల రంగులతో చీరలను తయారు చేయించామని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవు ఉండే 5లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయించామని పేర్కొన్నారు. ఇçప్పటివరకు ఉత్పత్తి అయిన 50 లక్షల చీరలను జిల్లాల వారీగా పంపిణీ చేయగా, మిగిలినవి అక్టోబర్ 10 నాటికి చేరతాయని తెలిపారు.
16 వేల మందికి ఉపాధి..
సిరిసిల్ల ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గాల్లో్ల పేదరికం, ఆత్మహత్యలు నివారించే విధంగా సిరిసిల్ల పవర్‌లూమ్ క్లస్టర్‌లో 16 వేల మంది నేత కార్మికులకు పని కల్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 6 నెలలుగా పది వేల కుటుంబాలు ఉపాధి పొందాయని చెప్పారు.
మెప్మా, సెర్ప్ కింద స్వయం çసహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు సంప్రదింపుల ద్వారా ఈ సారి చీరల తయారీ, డిజైన్‌లలో మార్పులు చేశామన్నారు. అనంతరం జౌళీశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చీరల తయారీలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించామని చెప్పారు. గడువులోగా చీరల పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment