అక్రమ నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో అక్రమాలకు పాల్పడిన కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బౌరంపేట గ్రామ పంచాయతీలో ధర్మగడ్డ ఉష ఐదేళ్లుగా కార్యదర్శిగా పని చేస్తోంది. బౌరంపేట గ్రామం ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉండడంతో భూములకు రెక్కలొచ్చాయి. అక్రమ లే అవుట్లు, వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కార్యదర్శిగా ఉన్న ఉష సదరు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని గతంలో వార్డు సభ్యులతో పాటు పలువురు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో కార్యదర్శి ఉష అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో సోమవారం కలెక్టర్ రఘునందన్ రావు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాచుపల్లి కార్యదర్శి సుధాకర్‌ను ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించినట్లు కుత్బుల్లాపూర్ మండల ఈఓపీఆర్డీ మల్లారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
బౌరంపేట గ్రామ కార్యదర్శిపై వేటు
Published Mon, Jan 4 2016 6:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement