సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ రాయితీ పథకాలకు వరుస అవరోధాలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్లు బీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రాయితీ పథకాలను నిలిపివేశారు. అయితే 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులిచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి స్వయం ఉపాధిలో ఆసక్తి ఉన్న బీసీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, తొలివిడతగా మొదటి కేటగిరీ లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 41వేల మంది లబ్ధిదారులను గుర్తించిన బీసీ కార్పొరేషన్ ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.50 వేల చొప్పున రాయితీని నేరుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు దాదాపు 19 వేల మందికి అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. మిగతా 22 వేలమంది లబ్ధిదారులకు రూ.106 కోట్లకు సంబంధించి చెక్కులు పంపిణీ చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ రద్దు కావడం, ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
దీంతో డిసెంబర్ వరకు చెక్కుల పంపిణీ అటకెక్కింది. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్న బీసీ కార్పొరేషన్... లబ్ధిదారుల పేరిట కొత్తగా చెక్కులను తయారు చేసి జిల్లాలకు పంపింది. ఇంతలో జనవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా మరోమారు చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు బీసీ కార్పొరేషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కుల పంపిణీకి ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంలో జాప్యం కావడంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల నగారా మోగింది. దీంతో స్వయం ఉపాధి పథకానికి పూర్తిగా బ్రేక్ పడినట్లైంది. మే నెలాఖరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అప్పటివరకూ చెక్కులు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. మరో పది రోజుల్లో వార్షిక సంవత్సరం ముగియనుంది. దీంతో ఈ ఏడాది విడుదల చేసిన నిధులను గడువులోగా ఖర్చు చేయకుంటే అవి తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమకానున్నాయి. లక్ష్యసాధన పూర్తి చేయాలంటే తిరిగి ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.
చెక్కులు... చిక్కులు!
Published Fri, Mar 22 2019 1:22 AM | Last Updated on Fri, Mar 22 2019 1:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment