
బీసీ బిల్లుకు మోక్షం ఎప్పుడు?
- 12న తెలంగాణ బీసీ రాష్ట్ర మహాసభ
- వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన కృష్ణయ్య
ముషీరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు తప్ప అన్ని బిల్లులను ఆమోదిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిల్లు విషయానికొచ్చేసరికి అందరూ మొండిచేయి చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నెల 12న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ వాల్‌పోస్టరును వివిధ బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్,ఎ.రామ్‌కోఠి, ఎం.అశోక్‌కుమార్, కె.శ్రీనివాస్‌లతో కలిసి ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలను రాజకీయంగా అణిచివేయడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. బీసీ ఓట్లతో గెలిచిన నేతలు పార్లమెంటులో నోరుమెదపకుండా మౌనం పాటిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోయిందని, 119 స్థానాలకు కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 12న జరిగే తెలంగాణ బీసీ మహాసభలో బీసీ ఉద్యమాన్ని బలమైన శక్తిగా నిర్మించడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని, భవిష్యత్ ఉద్యమ కార్యచరణపై చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు వెంకటనారాయణ, బాల్‌రాజ్, మారేష్, రవీందర్, నర్సింహనాయక్, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.