ఈ పాపం ఎవరిది? | Be held accountable for this sin? | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎవరిది?

Published Sat, Jun 28 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?

  •       భవనాలు లేకపోయినా విద్యుత్, నీటి కనెక్షన్లు
  •      ఇందులో నష్టపోయింది సామాన్యులే
  •      అధికారుల తీరుపైనా అనుమానాలు
  •      ఆక్యుపెన్సీ లేకుండా కనెక్షన్లు ఇవ్వడంపై విమర్శలు
  •      సర్కార్ ఆదేశాలతో మేల్కొన్న అధికారులు
  •      నీటి, కరెంట్ కనెక్షన్లపై ఆరా
  • సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: గురుకుల్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలపై పలు శాఖల అధికారులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్టడాలు అక్రమమని తెలిసిన సమయంలోనే ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఆక్యుపెన్సీ లేకపోయినా మంచినీటి, కరెంట్ కనెక్షన్లు ఎలా ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

    ఈ భూముల్లో సంపన్నులతోపాటు సామాన్యులు సైతం ఉన్నారు. తాజా చర్యలతో సామాన్యులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. గురుకుల్‌లో అక్రమాలకు సహకరించినా అధికారులనూ వదలొద్దనే డిమాండ్ విన్పిస్తోంది.  ఇక్కడ ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 600 భవనాలు. వీటి నిర్మాణాలకు అనుమతుల్లేవు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేవు. ఆస్తిపన్నూ లేదు. అయినప్పటికీ విద్యుత్, మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి.

    ఇదీ గురుకుల్ ట్రస్ట్‌లోని అయ్యప్ప సొసైటీ భూముల్లోని భవనాల వ్యవహారం. ఇందులో సామాన్యులు సైతం ఉన్నా ఇక్కడి భవనాల్లో బడా బాబులే అధికం. ఉన్నతస్థాయి పలుకుబడి, అండదండలతోనే ఆస్తిపన్నులు చెల్లించకపోయినా, ఆక్యుపెన్సీ లేకున్నా నిరాటంకంగా నెట్టుకొచ్చారు. మూడేళ్ల క్రితం గురుకుల్ ట్రస్ట్‌లోని భవనాలపై దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు దాన్ని మూణ్నాళ్ల తంతుగా ముగించారు. దాంతో, అక్రమంగా అంతస్తులు లేపినా ఏమీ కాదనే నిర్ణయానికొచ్చిన కొందరు మళ్లీ నిర్మాణాలను కొనసాగించారు. సుదీర్ఘ విరామం తర్వాత.. కొత్త సర్కారు అధికారంలోకి వచ్చాక ట్రస్ట్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. కొత్త సర్కార్ చర్యలకు దిగడంతో అంతిమంగా నష్టపోయింది సామాన్యులే.
     
    అధికారులనూ బాధ్యులను చేయాలి...
     
    సామాన్యులు నష్టపోవడం వెనుక పలు శాఖ అధికారుల పాత్ర ఉందని తెలుస్తోంది. అనుమతులు లేకుండా కట్టడాలు వెలిసినా.. ఆక్యుపెన్సీ లేకపోయినా విద్యుత్, నీటి కనెక్షన్లు ఇచ్చిన అధికారులనూ బాధ్యులను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం వీరి జోలికి పోని అధికారులు ఇప్పుడు తీవ్ర చర్యలకు సిద్ధమయ్యారు. విద్యుత్, నీటి కనెక్షన్లున్న వారికి మూడింతల పన్ను విధించేందుకు నిర్ణయించారు.

    మిగతా వాటికి కనెక్షన్లు ఇవ్వరాదని నిర్ణయించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనిదే విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వబోమని ఎంతోకాలంగా చెబుతున్నా దాన్ని అమలు చేసిన పాపాన పోలేదు. ఇకపై వీటిని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న పలు భవనాలను ఇప్పటికే కూల్చివేసిన అధికారులు, మరికొన్ని భవనాలను కూల్చివేసేందుకూ ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం 11 భవనాలకు సంబంధించిన 33 షట్టర్లకు తాళాలు వేశారు.

    ఫ్లెక్సీల ఏర్పాటు..
     
    గురుకుల్ భూముల్లోని ప్రధాన కూడళ్లలో సుమారు 20 చోట్ల అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడి భవనాలు అక్రమమని ఎవరూ కొనుగోలు చేయవద్దని అందులో పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోలో మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కూల్చివేసిన 24 భవనాలు, సీజ్‌చేసిన 11 భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఎప్పుడిచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తిరిగి వాటికి కనెక్షన్లు ఇవ్వరాదని ఆయా విభాగాలకు లేఖలు రాశారు. మరోవైపు సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల తదితర విభాగాల అధికారులు తమ్మిడికుంట చెరువు మార్కింగ్ పనులు మొదలుపెట్టారు.
     
    బోర్డుల ఏర్పాటు..
     
    గురుకుల్ ట్రస్టుతోపాటు హైటెక్ సిటీ సమీపంలోని అసైన్డ్ స్థలాలపైనా రెవెన్యూ అధికారులు  దృష్టి సారించారు. ఖానామెట్ సర్వే నెంబర్ 43 నుంచి 49 వరకు ఉన్న 30 ఎకరాల ఖాళీ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
     
     రెగ్యులరైజేషన్ వర్తించదు
    గురుకుల్ ట్రస్టులో వెలసిన నిర్మాణాలకు రెగ్యులరైజేషన్, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలు వర్తించవు. గురుకుల్ ట్రస్టులో ఉన్న ఖాళీ స్థలాలు, నిర్మాణాలకు సంబంధించి సంబంధితులకు వివిధ రకాల నోటీసులు ఇస్తాం. ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయింది. సమగ్ర నివేదికను రూపొందిస్తున్నాం.                       
    - సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్
     
     నీటి బిల్లులు మూడు రెట్లు అధికంగా వేస్తాం..
     భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతే నీటి కనెక్షన్ ఇస్తాం. ఇప్పటికే గురుకుల్‌లో భవనాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయని వాటిని పరిశీలిస్తున్నాం. కనెక్షన్ తీసుకున్న తేదీ నుంచి మూడింతలు బిల్లు చెల్లించాల్సిందే. బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తాం.                    
     - మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ జగదీశ్వర్
     
     తాము మధ్యతరగతి ప్రజలమని, తమ గోడు తెలంగాణ సీఎం వినాలని అయ్యప్ప సొసైటీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవనాలు సీజ్ చేస్తుండడంతో శుక్రవారం అయ్యప్ప సొసైటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమకు మార్గం చూపాలని కోరుతున్నారు.                                  
    - గచ్చిబౌలి
     
     పసుపు కుంకుమల కింద వచ్చిన ప్లాట్
     పసుపు కుంకుమల కింద మా నాన్న ఇచ్చిన ప్లాట్ ఇది. తెలియక భవనం కట్టుకున్నాం. తప్పును సరిచేసుకునే మార్గం చూపండి. ప్లీజ్ కూలగొట్టడమే మార్గమని చెప్పొద్దు.
     - సుమారావు, అయ్యప్పసొసైటీ
     
     దినదినగండమేనా?
     దినదినగండంగా బతుకుతున్నాం. ఉన్న డబ్బంతా నిర్మాణాలకే  వెచ్చించాం. భవనాలు కూల్చివేస్తే మేం ఎలా బతకాలి. నా భర్తకు గుండెపోటు వచ్చింది, అయ్యప్ప సొసైటీలో చాలామంది తెలంగాణగా వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రే మాకు దారిచూపాలి.                     
     - సులోచనా రెడ్డి, అయ్యప్ప సొసైటీ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement