- జిల్లాలో మావోల కదలికలు
- వరుసగా వెలుస్తున్న పోస్టర్లు
- నిశ్శబ్దం తర్వాత కలవరం
- సానుభూతిపరుల పనేనన్న ఓఎస్‌డీ
- సమాచార వ్యవస్థను బలపర్చుకోవాలని ఆదేశం
చౌటుప్పల్: జిల్లాలో రోజుకోచోట మావోయిస్టు పార్టీ పేరు తో పోస్టర్లు వెలుస్తుండడంతో జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు బీఅలర్ట్ అంటూ జిల్లా పోలీసులకు ఆదేశాలిచ్చారు. దశాబ్ద కాలం తర్వాత మావోయిస్టుల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాచకొండ ఒకప్పటి పీపుల్స్‌వార్ నక్సలైట్లకు సేఫ్‌జోన్‌గా ఉండేది. కాలక్రమేణా జరిగిన ఎన్‌కౌంటర్లలో చాలా మంది చనిపోగా, మిగిలిన వారు సేఫ్‌జోన్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో, మళ్లీ ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ల ద్వారా దళంలో చేరమని పిలువునివ్వడం చూస్తుంటే, రిక్రూట్‌మెంట్ల ద్వారా బలపడాలనే ఆలోచనలో ఉన్నట్టు అవగతమవుతోంది.
ఓఎస్డీ సందర్శన..
చౌటుప్పల్ మండలంలో రెండు రోజులుగా మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు వెలువడడంతో శుక్రవారం ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు పోస్టర్లు వెలిసిన గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టర్లపై ఆరా తీశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పోస్టర్లను పరిశీలించారు. పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. మావోయిస్టులు మొదట పోస్టర్లు వేసి బల పడతారని, ఆ తర్వాత కొందరినీ చితక్కొట్టి పాగా వేసి, అనంతరం తుపాకులు చేతపట్టి గ్రామాలలో తిరుగుతారని వివరించారు. మొదట పోలీసులంతా గత రికార్డులను తిరగేసి, ఎక్కడెక్కడ విధ్వంసాలకు పాల్పడ్డారు, ఎలా పాల్పడతారు, వారి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నె ట్‌వర్క్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, గతంలో మావోయిస్టుల నేపథ్యం ఉన్న వారి పేర్లు సేకరించాలని ఆదేశించారు.
జిల్లాకు చెందిన మావోయిస్టులు ఆరుగురు..
జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల లో మావోయిస్టులుగా పనిచేస్తున్నారని ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు విలేకరులకు తెలిపారు. జిల్లాలో మాత్రం ప్రస్తుతం నక్సలైట్లు లేరని స్పష్టం చేశారు. ఇటీవలి ప్రాంతంలో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతి పరుల పనిగా భావిస్తున్నామన్నారు. అలా అని మావోయిస్టుల కదలికలు లేవని కూడా చెప్పలేమన్నారు. పోస్టర్లు వేసిన వారు దొరికితే నే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట సీఐలు భూపతి గట్టుమల్లు, కె.శివరాంరెడ్డి, ఎస్‌ఐ హరిబాబు తదితరులు ఉన్నారు.
బీ అలర్ట్
Published Sat, Dec 6 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement