
ఓయూలో ‘బీఫ్ ఫెస్టివల్’ రగడ
ఎలాగైనా చేపడతామంటున్న డీసీఎఫ్
అడ్డుకుని తీరుతామంటున్న హిందూత్వ సంస్థలు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘బీఫ్ ఫెస్టివల్’ వేడి పుట్టిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని కొన్ని వర్గాలు చెబుతుండగా... ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మరో వర్గంవారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకుగాను ఎవరికివారు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
అగ్రనేతలకు ఆహ్వానం..
దేశవ్యాప్తంగా మతోన్మాదం పేరుతో దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు చేస్తున్నారని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ఆరోపిస్తోంది. దళిత బహుజనులు తినే ‘పెద్ద కూర’పై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంటూ, అందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 5న వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు వామపక్ష విద్యార్థి సంఘాలతోపాటు ఎంఐఎం కూడా మద్దతు ఇస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని, ఇప్పటికే ఫెస్టివల్‌పై విద్యార్థులతో చర్చించామని, మంగళవారం ఓయూ కవి సమ్మేళనం కూడా నిర్వహించాం. ఏడో తేదీన 5కే రన్ నిర్వహించనున్నట్లు డీసీఎఫ్ నేత దర్శన్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు కేర ళకు చెందిన పలువురు రాజకీయ నేతలతోపాటు రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలను కార్యక్రమానికి ఆహ్వానించామన్నారు. నవలా రచయిత అరుంధతి రాయ్ కూడా ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం.
అడ్డుకుని తీరుతాం...
ఇదిలా ఉండగా బీఫ్ ఫెస్టివల్‌ను ఎలాగైనా అడ్డుకుంటామని హిందూత్వ సంస్థల నేతలు, పలు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళనలు సైతం నిర్వహించారు. ఓయూలో ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వొందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో సోమవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ ఇన్‌ఛార్జి వీసీ రాజీవ్ ఆర్ ఆచార్యకు వినతి పత్రం అందజేశారు. అంతేగాక ఫెస్టివల్ జరిగే రోజున ‘చలో ఓయూ’కి ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. అయితే ఓయూలో ఫెస్టివల్ నిర్వహణకు ఇంతవరకు ఇన్‌చార్జి వీసీ, రిజిస్ట్రార్ సురేష్ కుమార్ అనుమతి లభించలేదు. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ అంశంపై వివరణ కోసం రిజిస్ట్రార్‌ని ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ చేసినా.. ఆయన నుంచి స్పందన కరువైంది.