బీర్‌'ఫుల్‌' | Beer Sales Hikes in Hyderabad | Sakshi
Sakshi News home page

బీర్‌'ఫుల్‌'

Published Mon, Jul 8 2019 11:27 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

Beer Sales Hikes in Hyderabad - Sakshi

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత జూన్‌ నెలలోబీరోత్సాహం కనిపించింది. లిక్కర్‌ కంటే బీరు వైపే మందుబాబులు ఎక్కువ మొగ్గు చూపారు. ఏడాదిగణాంకాలను పరిశీలిస్తే బీర్ల అమ్మకాల్లో ఎక్కువ పెరుగుదల
కనిపించడమే దీనికి నిదర్శనం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తాగడంతో అమ్మకాలు బాగా పెరిగాయి అనుకుంటే జూన్‌ నెలలోనూ రికార్డు స్థాయిలో అధికంగా అమ్ముడుపోవడం గమనార్హం. జూన్‌ నెలలో హైదరాబాద్‌ జిల్లాలో గడిచిన ఏడాదితో పోలిస్తే 18.06 శాతం, రంగారెడ్డి జిల్లాలో 19 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరిగింది. 

ఈ ఏడాది జూన్‌ నెలలో ఎండలు మండిపోయాయి. ఉక్కపోత తగ్గకపోవడంతో మద్యం ప్రియులు ఎక్కువగా లిక్కర్‌కు బదులు బీర్లు తాగడానికే  ఆసక్తి చూపారు. జూలై నుంచి బీర్ల అమ్మకాలు తగ్గి లిక్కర్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు.    

నీటి ఎద్దడిని అధిగమించి..
ఈ ఏడాది వేసవి కాలంలో రాష్ట్రంలోని అన్ని నదులు, జలాశయాల్లో నీటి కొరత ఏర్పడటంతో బీర్ల ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజుల పాటు ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో గ్రేటర్‌లో కొన్ని రోజుల పాటు ఆబ్కారీ శాఖ నుంచి సరఫరా సరిగ్గా లేకపోవడంతో  మద్యం దుకాణాలు, బార్‌లలో మే నెలలో బీర్లకు కొరత ఏర్పడింది. ఆ తర్వాత బీర్లు ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుని, ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెప్పించుకుని బీర్లను ఉత్పత్తి చేశాయి. దీంతో డిమాండ్‌ మేరకు సరఫరా చేయగలిగారు. దీనికి తోడు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుని సరఫరా చేశారు.

రంగారెడ్డి జిల్లాలో
రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూన్‌లో 6,38,150 కాటన్‌ల లిక్కర్, 11,65,641 కాటన్‌ల బీర్లు సేల్‌ కావడంతో ప్రభుత్వానికి రూ.426.05 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్‌ నెలలో 6,51,023 కాటన్‌ల లిక్కర్, 13,91,526 కాటన్‌ల బీర్లు సేల్‌ కావడంతో ప్రభుత్వానికి రూ.462.06 కోట్ల ఆదాయం చేకూరింది. లిక్కర్‌ అమ్మకాల్లో పెద్దగా తేడా లేకపోయినా 2 శాతం అమ్మకాలు పెరిగాయి. బీర్లు మాత్రం 19 శాతం అధికంగా గ్రోత్‌ రేట్‌ సాధించాయి. అమ్మకం విలువ 8 శాతం అదనంగా నమోదయింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 2018 మే నెలలో  533353 కాటన్ల లిక్కర్, 1425207 కాటన్ల బీర్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ. 396.95 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మే  నెలలో 6,10,081 కాటన్‌ల లిక్కర్, 15,96,409 కాటన్‌ల బీర్లు అమ్ముడుపోగా ఆదాయం రూ. 467.11 వచ్చింది. గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్‌ అమ్మకాలు 14 శాతం పెరగగా, బీర్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. అమ్మకం విలువ 18 శాతం పెరిగింది.

హైదరాబాద్‌ జిల్లాలో
హైదరాబాద్‌ జిల్లాలో గత ఏడాది జూన్‌లో 3,25,119 కాటన్ల లిక్కర్, 4,79,840 కాటన్‌ల బీర్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ.213.66 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జూన్‌లో 3,30605 కాటన్‌ల లిక్కర్, 5,69,131 కాటన్‌ల బీర్లు సేల్‌ కావడంతో రూ. 225.16 కోట్ల  ఆదాయం వచ్చింది. జూన్‌ నెలలో హైదరాబాద్‌ జిల్లాలో గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్‌ గ్రోత్‌ రేట్‌ కేవలం 1.7 శాతం మాత్రమే ఉంది. అదే బీర్ల గ్రోత్‌ రేట్‌ మాత్రం బాగా పెరగడంతో 18.6 శాతం పెరుగుదల నమోదయింది. మొత్తం అమ్మకం విలువ 5.4 శాతం పెరిగింది. అదేవిధంగా మే 2018 సంవత్సరంలో 2,70,663 కాటన్‌ల లిక్కర్, 5,75,575 కాటన్‌ల బీర్లు అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.191.61 కోట్ల ఆదాయం సమకూరింది. 2019 మే నెలలో 2,95,709 కాటన్‌ల లిక్కర్, 6,09,070 కాటన్‌ల బీర్లు అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.213.04 కోట్ల  ఆదాయం వచ్చింది. గడచిన ఏడాదితో పోలిస్తే లిక్కర్‌ 9.3, బీర్లు 5.8, గ్రోత్‌ రేటు సాధించగా అమ్మకం విలువ 11.2 శాతంపెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement